Begin typing your search above and press return to search.

ఉన్నోళ్లను కాపాడుకొంటే చాలదా రఘువీరా?!

By:  Tupaki Desk   |   14 July 2015 1:03 PM IST
ఉన్నోళ్లను కాపాడుకొంటే చాలదా రఘువీరా?!
X
ఆశలావు పీక సన్నం.. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీరును గమనిస్తే కలిగే అభిప్రాయం ఇది. కనీసం ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రవేశం కూడా లేదు. రాష్ట్ర విభజన పాపానికి ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఉనికి పాట్లు ఏవో కొనసాగుతున్నాయి. ఒక సామాన్యుడి అభిప్రాయం నుంచి చూసినా.. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ కోలుకొంటుందంటే..అది నమ్మశక్యం కాని విషయమే. కాంగ్రెస్ రక్తం నుంచి పుట్టిన వైకాపాతో కాంగ్రెస్ ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకం అయ్యింది.

మరి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... రఘువీర ఏదో చేస్తున్నాడులే అనుకొంటే... ఆయన తీరు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా రఘువీరారెడ్డి ఒక కొత్త వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహాన్ని అమలు పెట్టి.. కాంగ్రెస్ ను విడిచిపెట్టి పోయిన నేతలందరినీ తిరిగి రప్పించుకొంటారట! మరి నిన్నలా మొన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు సత్తిబాబు కాంగ్రెస్ ను వీడాడు. అవతల పార్టీలు అవకాశం ఇస్తే.. ఇప్పటికిప్పుడు పార్టీని వీడటానికి అనేక మంది సై అంటున్నారు.

మరి ఇలాంటి నేపథ్యంలో రఘువీరారెడ్డి తన శక్తి యుక్తులతో పార్టీలో ఉన్నవారిని కాపాడుకొంటే అదే పదివేలు. అలాగాక.. ఏకంగా ఇదివరకూ పార్టీని వీడిన వారినే తెచ్చుకొంటాం.. అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడు ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు! ఇది ఇప్పట్లో సాధ్యం అయ్యే అంశమా? అంటే.. అది ఎప్పటికీ కాదు.. అనుకోవాలి. మహా అంటే కాంగ్రెస్ సాధించగలిగితే.. తులసిరెడ్డి స్థాయి నేతలను మాత్రం తిరిగి తెచ్చుకోగలదేమో. కిరణ్ వెంట వెళ్లిన వారినెవరినైనా తిరిగి చేర్చుకోగలదేమో చూడాలి!