Begin typing your search above and press return to search.

ఖర్మ.. ఖర్మ.. ఇవెక్కడి గొప్పలు రఘువీరా?

By:  Tupaki Desk   |   19 March 2016 2:50 PM IST
ఖర్మ.. ఖర్మ.. ఇవెక్కడి గొప్పలు రఘువీరా?
X
ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించి పోరాటం చేసి.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని దృష్టికి సదరు సమస్యను తీసుకెళ్లాలని ప్రయత్నించి.. అందులో విఫలం కావటం ఫెయిల్యూర్ అనే కన్నా.. ఏపీ ప్రయోజనాలు పట్టలేదన్న ఆవేదన ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతారు. అదేం దరిద్రమో కానీ.. ఏపీ కాంగ్రెస్ నేతలకు అలాంటివి కించిత్ కూడా లేకపోవటమే కాదు.. ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటాన్ని గొప్పగా చెప్పుకోవటం వారికే చెల్లుతుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ మీద ఏపీలో కోటి సంతకాలు సేకరించి.. ఢిల్లీకి వెళ్లి మరో మూడు సంతకాల్ని యాడ్ చేయించుకొని.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం విపరీతంగా ప్రయాస పడిన పరిస్థితి. తొలుత రాష్ట్ర స్థాయిలో ప్రయత్నించినా నో చెప్పటం.. తర్వాత జాతీయ కాంగ్రెస్ నేతలు సైతం ప్రయత్నాలు చేసినా.. మోడీ ససేమిరా అనటంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేతికి అందించి.. ఆ తర్వాత మోడీ నివాసానికి కొరియర్ చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీకి వెళ్లి దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నా పని పూర్తి కాకపోవటంతో.. చేతులూపుకుంటూ వచ్చిన రఘువీరా విజయవాడకు రాగానే చెలరేగిపోయారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాల్ని ప్రభావితం చేసే అంశం మీద ప్రధాని కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారన్న విషయాన్ని వదిలేసి.. కాంగ్రెస్ నేతల కళ్లల్లోకి చూసే ధైర్యం లేకనే మోడీ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పుకోవటం గమనార్హం.

రఘువీరా మాటలు చూస్తుంటే.. వయసు మీద పడి.. మెదడు చురుగ్గా పని చేయటం లేదన్న భావన కలగటం ఖాయం. ఏపీ ప్రయోజనాలకు ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా మీద కోటి మంది ఏపీ ప్రజల ఆకాంక్షను ప్రధానికి తెలియజేసే అవకాశం ఇవ్వకపోవటాన్ని అవమానంగా భావించక.. అది కూడా తమ గొప్పగా చెప్పుకోవటం చూస్తే విస్మయం కలగటం ఖాయం. మోడీ అహంకారాన్ని ఏపీ ప్రజలకు వివరించే చక్కటి అవకాశంగా భావించటం మానేసి.. తమను చూసే ధైర్యం లేక అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదంటూ రఘువీరా అండ్ కో చెప్పిన వైనం చూస్తే ప్రజలకు ఏ విషయాన్ని ఎలా చెప్పాలన్న విషయాన్ని మర్చిపోయినట్లు కనిపించక మానదు.