Begin typing your search above and press return to search.

5లక్షల కోట్ల సంగతి అప్పుడేమైంది రఘువీరా?

By:  Tupaki Desk   |   23 Oct 2015 10:04 AM IST
5లక్షల కోట్ల సంగతి అప్పుడేమైంది రఘువీరా?
X
అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు తాజాగా చెలరేగిపోయారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో ఏపీకి ఎలాంటి వరాన్ని ప్రకటించటంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రుల నోట్లో మోడీ మన్నుకొట్టారని వ్యాఖ్యానిస్తున్న వారు.. దీనికి నిరసనగా ప్రధాని మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మల్ని తగలపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ నేతల ఆవేదనను.. ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ.. ఈ మొత్తం పరిస్థితికి కారణం వారేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ సైతం ఒక మాటను పదే పదే ప్రస్తావించారు. విభజన చట్టంలో ఏమైతే అంశాలు ఉన్నాయో.. వాటినన్నింటిని తీరుస్తామని హామీ ఇవ్వటం మర్చిపోకూడదు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.5లక్షల కోట్ల ఖర్చు అవుతుందని లెక్క చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఇవే లెక్కలు విభజన సమయంలో ఏం చేశారన్నది ప్రశ్న. ఆ రోజు ఎడాపెడా విభజన చేస్తున్న సమయంలో పార్టీ అధినేత్రిపై గట్టిగా నిలదీసి ఉంటే.. ఏపీ ప్రజలకు ఈ రోజు నిధుల కోసం అడుక్కోవాల్సిన పరిస్తితి ఉండేది కాదు.

రాజధాని నిర్మాణం కోసం రూ5లక్షల కోట్లు అని చెబుతున్న రఘువీరా అండ్ కో.. కనీసం రూ.2లక్షల కోట్లకు సబంధించి ఒక దీర్ఘకాలిక లెక్కను విభజన చట్టంలో చేర్చినా నిధుల కోసం ఈ రోజు అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదు. చట్టంలో ఉన్న అంశాల్ని న్యాయపరంగా నిలదీసి మరీ తెచ్చుకునే వీలుండేది. అలాంటి అపూర్వమైన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టి.. ఈ రోజు ప్రధాని దిష్టిబొమ్మను తగలెట్టాలన్న పిలుపు ఇచ్చిన దుస్థితి. విబజన సమయంలోనే ఏపీ ప్రజలకు నష్టం వాటిల్లే నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీని గట్టిగా నిలదీయటమే కాదు.. వారి దిష్టిబొమ్మలు ఎందుకు కాల్చనట్లు..? ఇప్పుడిన్ని మాటలు చెప్పే రఘువీరా అండ్ కో ఏకపక్షంగా విభజన చేసేసిన రోజు ఏమైపోయారు? ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు..?