Begin typing your search above and press return to search.

బాబును ర‌ఘువీరా ఎంత మాట‌న్నారంటే!

By:  Tupaki Desk   |   9 Oct 2017 4:35 PM IST
బాబును ర‌ఘువీరా ఎంత మాట‌న్నారంటే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి ఇటీవ‌లి కాలంలో కాస్తంత యాక్టివ్‌ గానే తిరుగుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌నను తీవ్రంగా వ్య‌తిరేకించిన ఏపీ ప్ర‌జ‌లు గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అందుకు కార‌ణ‌మైన కాంగ్రెస్‌కు సింగిల్ సీటు కూడా ఇవ్వ‌కుండా చాలా గ‌ట్టిగానే దెబ్బ కొట్టేశారు. ఆ క్ర‌మంలో పీసీసీ చీఫ్ ప‌ద‌విలో త‌న సొంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ర‌ఘువీరా కూడా ఓట‌మిని చ‌వి చూడ‌క త‌ప్ప‌లేదు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు ర‌ఘువీరాతో పాటు హ‌స్తం పార్టీ నేత‌ల‌కు చాలా కాల‌మే ప‌ట్టింద‌నే చెప్పాలి. అయితే పొలిటీషియ‌న్లు చాలా కాలం పాటు గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌లేరు క‌దా. అందుకేనేమో ర‌ఘువీరా కూడా ఆ షాక్ నుంచి ఇత‌ర నేత‌ల కంటే కాస్తంత ముందుగానే తేరుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తూనే అడ‌పాద‌డ‌పా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కూడా చేస్తున్నారు. చిన్న విష‌యం నుంచి పెద్ద విష‌యం దాకా ఏ ఒక్క‌దానినీ వ‌దిలిపెట్ట‌ని ర‌ఘువీరా... అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీ టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని ఏకి పారేస్తున్నారు.

అయితే ఇప్ప‌టిదాకా ఆయ‌న చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ విసిరిన కామెంట్లు ఒక ఎత్తైతే... కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ కేంద్రంగా చేసిన తాజా కామెంట్ మ‌రో ఎత్త‌నే చెప్పాలి. ఎందుకంటే... ఈ ద‌ఫా చంద్ర‌బాబును వేస్ట్ ఫెలోగా ర‌ఘువీరారెడ్డి తేల్చేశారు. అయినా చంద్రబాబును వేస్ట్ ఫెలే అనేంత‌గా ర‌ఘువీరా ఎందుకు ఫైర్ అయ్యార‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే... అసెంబ్లీలో సింగిల్ సీటు కూడా సాధించ‌లేక‌పోయిన కాంగ్రెస్‌ ను చంద్రబాబు విమ‌ర్శిస్తూనే ఉండ‌ట‌మేన‌ట‌. అధికారం ద‌క్కించుకున్న పార్టీగా ప్ర‌జల‌కు సుప‌రిపాల‌న అంద‌జేయాల్సిన టీడీపీ స‌ర్కారు... దానిని వ‌దిలేసి, కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శిస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నార‌ట‌. ఇంత‌మాత్రానికే చంద్ర‌బాబును ర‌ఘువీరా వేస్ట్ ఫెలో అనేస్తారా? అంటే... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు ర‌ఘువీరా నోటి నుంచి వేస్ట్ ఫెలో అన్న మాట వినిపించిన త‌ర్వాత కూడా అలాంటి అనుమానం రావ‌డానికే వీల్లేదు.

అయినా ర‌ఘువీరా ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *చంద్రబాబు ఒక వేస్ట్‌ ఫెలో. ఆడలేక మద్దెల ఓడు సామెత చందంగా తాను అధికారంలో ఉండి మాపై(కాంగ్రెస్ పార్టీపై) విమర్శలు చేయడమేంటి? సదావర్తి భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏకంగా కోర్టులనే తప్పు పట్టించింది. ఈ విషయాన్ని గుర్తించి కోర్టు చివాట్లు పెట్టినా సీఎం తుడుచుకుని పోతున్నారు* అని ర‌ఘువీరా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ర‌ఘువీరా ఇంకా ఏమ‌న్నారంటే... పోలవరం ప్రాజెక్టు మొదలు అన్నిపనుల్లోనూ చంద్ర‌బాబు ప్రజలను మోసం చేస్తున్నార‌ని విమర్శించారు. పొలవరం ప్రాజెక్టు పనులు చేసేవాళ్లంతా బాబు బినామీలేనని ఆరోపించారు. 2019 కల్లా పోలవరం పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు ఉండబోదని కూడా ర‌ఘువీరా ఓ ష‌ర‌తు పెట్టేశారు. ఇక త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించిన ర‌ఘువీరా... త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అక్కడ జరుగుతోన్న వ్యవహారాన్ని పరిశీలించి, నిజానిజాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించ‌డంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రజలను ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో సదావర్తి భుముల విషయంలో చర్చలు జరపాలని కూడా ర‌ఘువీరా డిమాండ్‌ చేశారు.