Begin typing your search above and press return to search.

అమ్మ దగ్గరే సాధించలేనోడివి రఘువీరా?

By:  Tupaki Desk   |   13 March 2016 11:21 AM IST
అమ్మ దగ్గరే సాధించలేనోడివి రఘువీరా?
X
రఘవీరాకు ఉత్సాహం వచ్చేసింది. ఏపీకి ప్రత్యేకహోదా నినాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగటంతో.. ఆయన నోటి నుంచి మాటలు కాస్తంత గట్టిగా వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల్ని సాధించేందుకు పార్లమెంటు ఎదుట నిరసన తెలపాలని డిసైడ్ కావటం.. ఈ కార్యక్రమానికి అధినేత్రి సోనియమ్మ కూడా హాజరయ్యే అవకాశం ఉందని.. రఘువీరా బ్యాచ్ తో గళం విప్పే వీలుందని చెబుతుండటంతో రఘవీరాకు ఎక్కడలేని ఊపు వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి బయలుదేరిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటం ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతి.. ప్రధాని.. పార్టీ అధినేత్రిని కలిసి తాము సేకరించిన కోటి సంతకాలను అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న రఘువీరా.. ఇంతే సీన్ ఉంటే.. విభజన సమయంలో ఏపీకి నష్టం వాటిల్లకుండా పార్టీ అధినేత్రి సోనియాను ఎందుకు అడగలేకపోయారు? రాజధాని కట్టుకోవాలన్న మాటను మాత్రమే చెప్పినోళ్లు.. కేంద్రం రూ.లక్ష కోట్లు నిర్ణీత కాల వ్యవధిలో ఏపీకి ఇస్తుంది లాంటి క్లాజులు ఎందుకు పెట్టించలేకపోయారు?

సొంత పార్టీ అధినేత్రినే తమ వాదనతో కన్విన్స్ చేయలేని రఘువీరా లాంటి బ్యాచ్.. ఏపీకి ప్రత్యేక హోదా హామీని సాధించి తీరుతామని చెప్పుకోవటం చూస్తే కాసింత కామెడీగా అనిపించక మానదు. ఇలాంటి గొప్పలు చెప్పటం మానేసి.. ఏదైనా సాధించిన తర్వాత మాటలు చెబితే బాగుంటుందన్న విషయాన్ని రఘువీరా అండ్ కో గుర్తిస్తే మంచిది.