Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ ఫలితాలివి!

By:  Tupaki Desk   |   8 Nov 2016 10:56 AM IST
ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ ఫలితాలివి!
X
గతకొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలను కుదుపు కుదుపుతున్న అంశం "ప్రత్యేక హోదా". 2014 ఎన్నికల ముందు మోడీ - వెంకయ్య - చంద్రబాబు లకు ఉన్న పాపులారిటీని - ప్రజాభిప్రాయాన్ని - ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్కసారిగా అధఃపాతాళానికి పంపేసిన విషయం ఇదే అనికూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. కొంతమంది రోడ్లపైకి వచ్చి పోరాడగలరు, మరికొంతమంది పత్రికల్లో ప్రచురించగలరు కానీ... అవన్నీ చేయలేకపోయినా ఏపీలో ఉన్న దాదాపు ప్రతిఒక్కరికీ ప్రత్యేకహోదా రావాలనే ఉందని చెప్పవచ్చు! ఈ విషయంలో ప్రజా స్పందనే దానికి ఉదాహరణ. ఇదే సమయంలో 2019 ఎన్నికలకు ఈ అంశంపైనే వెళ్లే ఆలోచన కూడా వైకాపా అధినేత ఇప్పటికే చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా విడుదలయిన ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక బ్యాలెట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా అనే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోలింగ్ లో పాల్గొన్న వారిలో 18,693 మంది ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేయగా, కేవలం 28 మంది మాత్రమే హోదా వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఈ విషయాలను ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీర తెలిపారు. ఇదే క్రమంలో టీడీపీ ఎన్నికల హామీల విషయంలో... 18,311 మంది హామీలు నెరవేరలేదని చెప్పగా, 32 మంది మాత్రం హామీలు నెరవేరాయని ఓటేశారని ఆయన వివరించారు.

దీంతో ప్రత్యేక హోదా అనే అంశం పై ఏపీ ప్రజల అభిప్రాయం మరోసారి తేటతెల్లమైందనే అనుకోవాలి. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని, హోదాను కాదని ప్యాకేజీ పేరుచెప్పి ప్రకటించిన వాటికి ఇప్పటికే సన్మానాలు చేయించేసుకుంటున్న వెంకయ్య తాజాగా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ రాజకీయాల్లో కీలకమైన అంశం కాబోతుందనే విషయం సుస్పష్టం!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/