Begin typing your search above and press return to search.

పోసాని చెప్పిన జగన్ కుల పట్టింపులపై రఘురామ జవాబు

By:  Tupaki Desk   |   28 Sep 2021 4:30 PM GMT
పోసాని చెప్పిన జగన్ కుల పట్టింపులపై రఘురామ జవాబు
X
నటుడు , రచయిత పోసాని కృష్ణమురళి ఇటీవల ఏపీ సీఎం జగన్ కు అసలు కులపట్టింపులు లేవని.. సామాజిక న్యాయం చేస్తున్నాడని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఏపీలో సామాజిక న్యాయం జగన్ చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు.

పోసాని వ్యాఖ్యలపై ఢిల్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చారు. జగన్ కేబినెట్ లో, నామినేటెడ్ పదవుల్లో ఎంత మంది రెడ్డిలకు పదవులు ఇచ్చారనే దానిపై లెక్క చెబుతూ లిస్ట్ ను విడుదల చేశారు. ఏపీలో రెడ్డిలకు ఎక్కువ పదవులు వచ్చాయని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై ఏపీ మంత్రుల విమర్శలు సరికాదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని అనవసరపు వ్యాఖ్యలు చేశారని.. కుల ప్రస్తావన తీసుకువచ్చారని విమర్శించారు. కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు అంటూ కామెంట్లు చేసుకోవడం ఇరువురికి సరికాదని సూచించారు.

పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వైవాహిక సంస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేయడం నీచాతినీచమైన సంస్కృతి అని ధ్వజమెత్తారు. పవన్ వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని, నటుడు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పు ఏముందని నిలదీశారు.

ఇకనైనా ఇలాంటి నాన్నెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని మంత్రి పేర్ని నానిని కోరారు. జగన్ సర్కార్ సినిమా టికెట్లకు సంబంధించి పోర్టల్ ఏర్పాటుపై కంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ పై దృష్టిపెడితే మంచిదని సూచించారు.

ఇప్పటికే అనేక కేసుల్లో న్యాయవాదులకు కోట్లు చెల్లిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పుడీ దుబారాలు అవసరమా? అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చురకలంటించారు.