Begin typing your search above and press return to search.

నో అరెస్ట్ : నా జన్మభూమి అంటూ ఉప్పొంగుతున్న రఘురామ...

By:  Tupaki Desk   |   1 July 2022 2:00 PM GMT
నో అరెస్ట్ : నా జన్మభూమి అంటూ ఉప్పొంగుతున్న రఘురామ...
X
మొత్తానికి రెబెల్ ఎంపీ రఘురామ‌క్రిష్ణం రాజు సాధించారు. ఆయన కోరుకున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో జరిపే పర్యటనలో ఆయనతో కలసి  పాల్గొనబోతున్నారు. ఇక ఏపీకి వచ్చి తన సొంత నియోజకవర్గంలో సందడి చేయడానికి రఘురామకు కచ్చితమైన న్యాయ‌ భరోసా లభించింది. ఆయన భీమవరంలో ల్యాండ్ కాగానే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చూస్తే అసలు కుదిరేది కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

రఘురామ భీమవరంలో మూడు నాలుగు తేదీలలో పర్యటించినపుడు ఆయన పట్ల చట్టబద్ధంగా వ్యవహరించాలని హై కోర్టు పోలీసులకు సూచించింది. అంటే ఇలా కేసు ఫైల్ చేసి అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు అని పేర్కొంది. ఈ మేరకు కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో రఘురామ రాజు సొంతూరు టూర్ ఖరారు అయినట్లే.

ఆయన భీమవరానికి 3న చేరుకుని 4న ప్రధానితో జరిగే కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అలా నరేంద్ర మోడీతో కలసి వేదికను పంచుకుంటారు. అంతే కాదు, అదే కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి  ఎదురుపడబోతున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత ఈ ఇద్దరు నాయకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే సందర్భం ఇదే అవుతుంది.

ఒక విధంగా టోటల్  మీడియా ఫోకస్ అంతా రఘురామ జగన్ ల మధ్యనే ఉంటుంది అనడంలో డౌటే లేదు. ప్రధాని మోడీ ప్రోగ్రామ్ కంటే ఇదే హైలెట్ అయినా ఆశ్చర్యం లేదు ఇక మోడీతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని తనకు ఢిల్లీ లెవెల్ లో ఉన్న పలుకుబడిని రాఘురామ జగన్ ముందు ప్రదర్శించడానికి కూడా ఇది సరైన అవకాశం అని అంటున్నారు.

మొత్తానికి మూడేళ్ళుగా వైసీపీ సర్కార్ ని జగన్ని ఇబ్బంది పెడుతున్న రఘురామ భీమవరం వేదికగా చేసే పొలిటికల్  రీ సౌండ్ ఎలా ఉంటుందో చూడాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రఘురామ ఫ్రీ బర్డ్ లా ఇలా వచ్చి అలా హ్యాపీగా వెళ్ళేలాగా న్యాయ రక్షణ లభించిన దృష్ట్యా ఆయన రాజకీయంగా మాటల తూటాలని ఏమైనా పేల్చే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏమైనా రఘురాముడు నా జన్మ భూమి ఎంతో అందమైన ప్రదేశం అంటూ భీమవరానికి లగెత్తుకుని వచ్చేస్తున్నారోచ్.  ఇన్నాళ్ళుగా ఆయన టూర్ మీద సాగిన సస్పెన్స్ కి ఇక ఫుల్ స్టాప్ పడినట్లే.