Begin typing your search above and press return to search.

ఢిల్లీ మంత్రాంగం: విజయసాయిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jun 2020 9:50 AM GMT
ఢిల్లీ మంత్రాంగం: విజయసాయిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
X
ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తూ మంత్రాంగం నడుపుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను అని.. విజయసాయిరెడ్డి ఎన్ని రాతలు రాయించినా తాను పార్టీకి విధేయుడిని అని అన్నారు. విజయసాయిరెడ్డి చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారని.. షోకాజ్ నోటీసులు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. మెయిల్ లో తన వివరణ ఇస్తాను అని రఘురామకృష్ణం రాజు అన్నారు. తన షోకాజ్ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నానన్నారు.

టీటీడీ ట్రస్ట్ బోర్డ్ నిర్ణయాన్ని ఓ భక్తుడిగా విభేదించానని.. పార్టీ నిర్ణయాన్ని విభేదించినట్లు చిత్రీకరించారని రఘురామ చెప్పుకొచ్చాడు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కాబట్టి రక్షణ కల్పించమన్నానని అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశానని వివరించారు. ఇక రాజ్ నాథ్ సింగ్ తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యానన్నారు.

అంతకుముందు రఘురామకృష్ణం రాజు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. రాజ్ నాథ్ తో వైసీపీ పంపిన షోకాజ్ నోటీసుపై చర్చించినట్టు తెలిపారు. శరద్ యాదవ్ లా రఘురామపై పార్లమెంట్ లో వేటు వేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో రాజ్ నాథ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన రఘురామకృష్ణం రాజు పార్టీ నోటీసుల్లో వైసీపీ అసలు పేరు నోటీసుల్లో పేర్ల మధ్య వ్యత్యాసంపై ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ లేదని.. తనపై చర్యలు ఎలా తీసుకుంటారనే విషయాలపై ఆరాతీసినట్టు తెలిసింది.