Begin typing your search above and press return to search.

జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Sept 2022 6:09 PM IST
జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలన వ్యాఖ్యలు
X
యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతం చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసినప్పటి నుంచి రోజుకోవార్త వస్తోంది. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తాము ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని.. ఆయనకు ప్రజల్లో ఏ ప్రాంతంలో ఇమేజ్‌ ఉంటే ఆయనతో ప్రచారం చేయిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ బీజేపీలో చేరకపోవచ్చని ఆర్‌ఆర్‌ఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ బీజేపీ తరఫున ప్రచారం చేస్తే ఆయన కొన్ని వర్గాల అభిమానులను దూరం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ తప్పు చేయరని భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కీలకంగా మారతారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు తెలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆలోచనలన్నీ ప్రస్తుతానికి సినిమాలపైనే ఉన్నాయని రఘురామకృష్ణరాజు చెప్పారు. రాజకీయాల గురించి ఆయన ఆలోచనలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ బీజేపీకి ప్రచారం చేసే అవకాశం కనిపించడం లేదని వెల్లడించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్థానం ఎప్పటికయినా టీడీపీతోనే ఉంటుంది తప్ప బీజేపీతో ఉండదన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకోవడానికి సోము వీర్రాజు పడరాని పాట్లు పడుతున్నా ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

అలాగే జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ వదులుకోదని రఘురామకృష్ణరాజు తేల్చిచెప్పారు. పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ అధిష్టానం పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. కాబట్టి బీజేపీ పవన్‌ కల్యాణ్‌ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలో బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. అలాగే టీడీపీ–బీజేపీ పొత్తు ఉండదని తాను భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.