Begin typing your search above and press return to search.

వీల్ ఛెయిర్ లో కేంద్రమంత్రితో రఘురామ భేటీ.. ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు

By:  Tupaki Desk   |   31 May 2021 4:41 AM GMT
వీల్ ఛెయిర్ లో కేంద్రమంత్రితో రఘురామ భేటీ.. ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు
X
మరింత మెరుగైన వైద్యం కోసం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వైద్య సేవల్ని అందుకోవటంతో సరిపుచ్చటం లేదు. కేంద్రానికి చెందిన పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణల్ని చేస్తున్నారు. తాజాగా వీల్ చెయిర్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. వీల్ ఛెయిర్ లో తనతో భేటీ అయ్యేందుకు వచ్చిన రఘురామను చూసి రాజ్ నాథ్ ఆశ్చర్యంతో పాటు.. ఎంతో బాధ పడినట్లుగా చెబుతున్నారు.

రాజ్ నాథ్ తో భేటీ సందర్భంగా తనకు ఎదురైన పరిస్థితులు.. తనపై పోలీసులు జరిపిన దాడి.. కోర్టు ఆదేశాలతో తాను సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన వైనంతోపాటు.. తనపై జరుగుతున్న కుట్రకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్న వేళ.. తనను మరోసారి అరెస్టు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించినట్లుగా ఆరోపించారు.

దీనికి సంబంధించి ఆయన కొన్ని సంచలన అంశాల్ని రాజ్ నాథ్ తో పంచుకున్నారు. తాను మిలటరీ ఆసుపత్రిలో ఉన్న వేళ టీటీడీ అదనపు ఈవోగా పనిచేస్తున్న డిఫెన్స్‌ ఆడిట్‌ అకౌంట్స్‌ సర్వీసు ఉద్యోగి ధర్మారెడ్డి.. మిలిటరీ ఆస్పత్రి రిజిస్ర్టార్‌ కేపీ రెడ్డిలతో పాటు గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి లు కలిసి తనను మరోసారి అరెస్టు చేసేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపించారు. మిలటరీ ఉద్యోగులైన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్ నాథ్ ను రఘురామ కోరారు.

తాను మిలటరీ ఆసుపత్రిలో ఉన్న వేళలో మే 18న ధర్మారెడ్డి హైదరాబాద్ కు వచ్చారని.. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి రిజిస్ట్రర్ కేపీ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి.. తనను త్వరగా డిశ్చార్జి చేయించే ప్రయత్నం చేశారన్నారు. 24న డిశ్చార్జి చేయాలని కేపీ రెడ్డి తనకు వైద్యం చేస్తున్న డాక్టర్లపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారన్నారు. మరింత చికిత్స అవసరమని తాను గట్టిగా పట్టుబట్టటంతో చివరకు 26న తనను డిశ్చార్జి చేశారన్నారు.

కేపీరెడ్డి.. ధర్మారెడ్డి.. గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు కలిసి తనను మిలటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే అరెస్టు చేసేందుకు పదిహేను మంది ఏపీ పోలీసుల్ని రప్పించినట్లు చెప్పారు. సుప్రీకోర్టు అనుమతించిన తర్వాత.. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. ఏపీపోలీసులు ఎందుకు మొహరించారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు హామీ కలిగించే ఉద్దేశంతోనే కేపీ రెడ్డి తనను మిలటరీ ఆసుపత్రి నుంచి తరలించేందుకు జరిగిన కుట్రకు సహకరించొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కేపీరెడ్డి కాల్ రికార్డుల్ని తనిఖీ చేయాలని కోరారు. సంచలనంగా మారిన తాజా ఆరోపణల నేపథ్యంలో ఆ ముగ్గురిలో.. రక్షణ శాఖ ఉద్యోగులైన ఇద్దరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.