Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటా... భ‌ద్ర‌త ఇవ్వండంటున్న ర‌ఘురామ‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:01 AM GMT
ప్ర‌ధాని రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటా... భ‌ద్ర‌త ఇవ్వండంటున్న ర‌ఘురామ‌
X
గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని న‌ర‌సాపురం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచారు.. రఘురామ‌కృష్ణంరాజు. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ అధిష్టానంతో పొడ‌సూపిన విభేదాల‌తో ఆ పార్టీకి చుక్క‌లు చూపిస్తున్నారు. నిత్యం వివిధ టీవీ చాన‌ళ్లు, యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అరెస్టు చేసి పోలీసుల‌తో కొట్టించింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. చివ‌ర‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా త‌న‌ను సీఐడీ పోలీసులతో జ‌గ‌న్ కొట్టించార‌ని మండిప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు భ‌ద్ర‌త కావాల‌ని.. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు కేంద్రం వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించింది. అప్ప‌టి నుంచి రాష్ట్రానికి దూరంగా ఢిల్లీలోనే ర‌ఘురామ‌కృష్ణంరాజు ఉంటున్నారు. తిరిగి తన నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టలేదు. గతంలో పలుమార్లు నియోజకవర్గానికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఈసారి ప్రధాని న‌రేంద్ర మోడీ జూలై 4న‌ భీమవరం వ‌స్తుండ‌టంతో ఆ టూర్ ను అడ్డుపెట్టుకుని ఏపీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం భద్రత కోరుతున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో విభేధించడం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీకే పరిమితమవుతున్నరఘురామ తన సొంత నియోజకవర్గం నరసాపురానికి పూర్తిగా దూరమయ్యారు. తనకు ఓట్లు వేసిన నరసాపురం ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యంగా భావించి ఢిల్లీలోనే ఉండిపోయారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ లేదంటూ వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ.. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. కానీ మధ్యలో నియోజకవర్గానికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు.

సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి వచ్చేందుకు కొంతకాలంగా శత విధాలా ప్రయత్నిస్తున్న రఘురామరాజు.. త్వరలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ భీమవరానికి వస్తున్న జూలై 4వ తేదీన ఎలాగైనా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. ఓవైపు తనకు రక్షణ లేదంటూనే మరోవైపు భీమవరానికి వెళ్లాలని భావిస్తున్న రఘురామ ఇందుకోసం కేంద్రాన్ని ఆశ్రయించారు. గతంలో ఓసారి కేంద్రాన్ని ఆశ్రయించి వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ... ఇప్పుడు మరోసారి తనకు భీమవరం టూర్ లో భద్రత కోరుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను, హోంశాఖ కార్యదర్శిని క‌లిశారు. జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారి దృష్టికి తెచ్చారు, తాజాగా విశాఖ లో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించినా తనను అడ్డుకున్నారని ర‌ఘురామ‌కృష్ణంరాజు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ భీమవరం టూర్ లో తనకు తగిన భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని విన్న‌వించారు. అయితే దీనిపై కేంద్ర‌ హోంశాఖ త‌క్ష‌ణం స్పందించ‌లేద‌ని తెలిసింది.