Begin typing your search above and press return to search.

ఢిల్లీకి చేరిన రఘురామ వివాదం

By:  Tupaki Desk   |   21 May 2021 4:20 AM GMT
ఢిల్లీకి చేరిన రఘురామ వివాదం
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వివాదం ఢిల్లీకి చేరుకుంది. ఎంపి వివాదంపై విచారణను రాష్ట్రపరిధి నుండి ఎలాగైనా తప్పించాలని కుటుంబసభ్యులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ముందు కేంద్ర శాఖమంత్రి అమిత్ షా, తర్వాత రక్షణరంగ మంత్రి రాజనాధ్, తర్వాత లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులతో భేటీ అవ్వటంలో ఇందులో భాగమే. ఎవరితో భేటీ అయినా కుటుంబసభ్యుల డిమాండ్ ఒకటే.

అదేమిటంటే తమతండ్రికి ప్రాణభయం ఉందని, సీఐడీ విచారణలో ఉన్నపుడు తీవ్రంగా కొట్టారని. కాబట్టి విచారణను సీఐడీ పరిధి నుండి తప్పించి సీబీఐ లేదా సుప్రింకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరపాలని రిక్వెస్టు చేసుకున్నారు. ఇది సరిపోదన్నట్లుగా ఇదే అంశాలతో తాజాగా ఎంపి కొడుకు భరత్ సుప్రింకోర్టులో మళ్ళీ రెండు పిటీషన్లు వేశారు. సీఐడీ కస్టడీలో ఉన్నపుడు తనను కొట్టారని ఎంపి చేసిన ఆరోపణలు వాస్తవమా ? లేకపోతే అబద్ధమా ? అన్నదే తెలీటంలేదు.

ఎప్పుడైతే ఎంపి ఆరోపణలు చేశారో అప్పటినుండి వివాదం పెరిగిపోయింది. ఇదే విషయమై నిర్ధారించేందుకు సెషన్స్ కోర్టు నియమించిన మెడికల్ బోర్డు ఎంపిని పరీక్షించి ఎడీమాతో బాధపడుతున్నందున కాళ్ళు వాయటం, అరిపాదాలపై మచ్చలు ఏర్పడ్డాయే కానీ కొట్టిన దెబ్బలుకావని తేల్చారు. ఇదే విషయమై సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో జరిపిన పరీక్షలు రిజల్టు ఇంకా వెల్లడికాలేదు. అయితే కుటుంబసభ్యులు, చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం ఎంపిని కొట్టారని, హింసించారని ఆరోపణలు చేస్తునేఉన్నారు.

విషయం ఏదైనా రఘురామపై విచారణను రాష్ట్రప్రభుత్వ పరిధిలో నుండి తప్పించేందుకు కుటుంబసభ్యులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఒకవైపు కేంద్రమంత్రులను కలుస్తునే మరోవైపు సుప్రింకోర్టులో వరుసబెట్టి కేసులు వేయటం ఇందులో భాగమనే చెప్పాలి. ఎంపి వివాదంలో కేంద్రమంత్రులు జోక్యం చేసుకుంటారని అనుకునేందుకులేదు. అలాగే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యానికి కూడా అవకాశం లేనట్లే. ఇక సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నదే ఆసక్తిగా మారింది.