Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుపై రఘునందన్ రావు

By:  Tupaki Desk   |   7 Jun 2022 5:09 AM GMT
తగ్గేదేలే.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుపై రఘునందన్ రావు
X
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో పెను సంచలనానికి నాంది పలికారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎమ్మెల్యే కొడుకు లేడంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చిన మరునాడే ఆ గ్యాంగ్ రేప్ నకు ముందు చోటుచేసుకున్న ఫొటోలు, వీడియోలు విడుదల చేసి సంచలనం సృష్టించారు. నిందితుల అరెస్ట్ ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు.

కొందరు పోలీసు అధికారులు మీడియాను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు నిందితుల వైపా? బాధితుల వైపా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తికాకముందే కొందరికీ క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్న వారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు.

అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని రఘునందన్ రావు ఆరోపించారు. కారులో ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. కానీ వీటిని ప్రపంచానికి ఎంతవరకూ చూపించాలో తనకు తెలుసు అని కొద్దిగా మాత్రమే మీడియా ముందు చూపించి వారి ముఖాలు కనపడకుండా రఘునందన్ రావు ప్రదర్శించారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ప్రశ్నించారు.హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని తెలిపారు.

అత్యంత రహస్యంగా ఉంచిన ఈ ఆధారాలు, వీడియోలు, ఫొటోలు ఇప్పుడు రఘునందన్ రావు చేతికి ఎలా చిక్కాయని పోలీసులు శూలశోధన మొదలుపెట్టారు. ఈ ఆధారాలు బయటకు పొక్కడంపై విచారణ జరుపుతున్నారు. అంతేకాదు.. ఇవి రఘునందన్ కు ఎలా లభించాయని.. వాటిని ప్రదర్శించిన రఘునందన్ పై కేసులు పెట్టి అరెస్ట్ చేయవచ్చా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

అయితే తనపై కేసుల దిశగా ప్రభుత్వం , పోలీసులు ఆలోచిస్తున్నారని తెలియగానే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు నుంచి ఎంఐఎం నాయకులను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. తాను ఫొటోలు, వీడియోలు విడుదల చేయకముందే టీవీల్లో సీసీటీవీ ఫుటేజీలు వచ్చాయన్నారు. బాలిక పేరు, ముఖం కనిపించేలా తాను చూపెట్టలేదన్నారు.

తనకు కేసులంటే భయం లేదని.. కొత్తేం కాదని.. ఉడత ఊపులకు భయపడనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంతో నేరుగా ఫైట్ కే రఘునందన్ రావు డిసైడ్ అయ్యారు.