ఆ రైలు ఎక్కి ఉంటే.. అది చివరి యాత్ర అయ్యేది.. రఘురామ సంచలన వ్యాఖ్యలు

Tue Jul 05 2022 21:28:58 GMT+0530 (India Standard Time)

raghu rama krishnam raju news update

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద తాను ప్రయాణించే ట్రైన్ బోగీ తగులబెట్టేందుకు కుట్ర జరిగిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చే మార్గంలో సత్తెనపల్లి వద్ద బోగీ తగులబెట్టి తనను హతమార్చే ప్లాన్ జరిగిందని రఘురామ ఆరోపించారు.దీని వెనుక ఎవరున్నారు ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్లాయో కూడా ఆయన బయటపెట్టారు. తనను భీమవరం రాకుండా అడ్డుకున్నట్లు ఎంపీ తెలిపారు. దీంతో రఘరామ టూర్ రద్దు చేసుకోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. డీజీ ఆఫీసు నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందన్నారు. రఘురామ వస్తే ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు అందాయన్నారు. చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోనే 20 మంది పోలీసులు చెకింగ్ మొదలు పెట్టారన్నారు. రైలు ఆంధ్రా సరిహద్దుకు చేరుకోగానే అదుపులోకి తీసుకునేందుకు ప్రణాళిక రచించారన్నారు.

ప్రధాని మోడీ భీమవరం టూర్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి నరసపూర్ ఎక్స్ ప్రెస్ లో వచ్చేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు మంగళవారం మరోసారి స్పందించారు. తనను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆయన బయటపెట్టారు. అంతే కాదు ఏపీ పోలీసులు తన హత్యకు కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.  

తాను ప్రయాణిస్తున్న రైలు బోగీ తగులబెట్టాలని డీజీ ఆఫీసు నుంచే ఆదేశాలు వెళ్లాయని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఆరోపించారు. అంతే కాదు ఇందుకు తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. వీటి ద్వారానే తనకు సమాచారం అందిందన్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న తర్వాతే ఆయన భీమవరం టూర్ రద్దు చేసుకున్నారో లేదో మాత్రం రఘురామ చెప్పలేదు.  

మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

ఎంపీ రఘురామకృష్ణరాజుని సత్తెనపల్లిలో హత్య చేసేందుకు.. తాడేపల్లి నుంచి ప్రణాళిక వెళ్లిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బొండా ఉమ ఆరోపించారు. భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతికి.. నర్సాపురం రైలుకు రఘురామ వచ్చి ఉంటే.. ఆయనకదే చివరి రోజయ్యేదన్నారు. సొంత పార్టీ ఎంపీని రానీయకుండా ముఖ్యమంత్రి లేఖ ఇప్పించారని ఆరోపించారు.