Begin typing your search above and press return to search.

రాఫెల్ మీద రిల‌య‌న్స్ వివ‌ర‌ణ విన్నారా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:48 AM GMT
రాఫెల్ మీద రిల‌య‌న్స్ వివ‌ర‌ణ విన్నారా?
X
ఎవ‌రినైనా మీరు త‌ప్పు చేశారా? అని ప్ర‌శ్నిస్తే.. అవును.. చేశాను అన్న మాట నోటి నుంచి రావ‌టం అన్న‌ది ఉండ‌దు. ఎవ‌రికి వారు.. తాము చేసింది త‌ప్పు అనే క‌న్నా.. తాము అలా ఎందుకు చేశాం? దానికి కార‌ణ‌మైన అంశాల మీద‌నే ఎక్కువ‌గా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. త‌ప్పును త‌ప్పు అని ఒప్పుకునే క‌న్నా.. అలా జ‌ర‌గ‌టానికి కార‌ణం మాత్రం ఇదే సుమా అని చెప్ప‌టం ద్వారా.. త‌న త‌ప్పును క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌టంతో పాటు.. మోడీ పాల‌న‌కు మ‌చ్చ వేస్తూ రాఫెల్ డీల్ తెర మీద‌కు వ‌చ్చి.. ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ఈ ఒప్పందం గురించి ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిన అన్ని వివ‌రాలూ సంచ‌ల‌నంగా ఉండ‌ట‌మే కాదు.. ఈ డీల్ పై బోలెడ‌న్ని సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా ఉన్నాయి.

రాఫెల్ డీల్ లో అనుభ‌వం లేని రిల‌య‌న్స్ కు అంత భారీ ఒప్పందాన్ని క‌ట్ట‌బెట్ట‌టంపై చాలానే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వీటి విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌ని స‌ద‌రు సంస్థ తాజాగా మాత్రం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందులో.. త‌మ‌పై వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానాలు చెప్పే కంటే.. తాము చెప్పాల‌నుకున్న మాట‌ల్నే చెప్ప‌టం క‌నిపిస్తుంది. ఈ వివ‌ర‌ణ‌లో హైలెట్ అయిన పాయింట్.. రాఫెల్ యుద్ధ విమ‌నాల‌కు సంబంధించి ర‌క్ష‌ణ శాఖ‌తో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేద‌ని చెప్ప‌టం.

ఈ మాట‌ను చూస్తే రాఫెల్ మీద వివ‌ర‌ణ ఎలా ఉంటుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక పెద్దాయ‌న ఒక షాపు వాడికి ప్ర‌తి నెలా భారీగా కొనుగోలు చేస్తాన‌ని చెప్పి.. అత‌డి అమ్మ‌కాల్లో పాతిక శాతం మొత్తాన్ని తానే కొనేందుకు ముందుకు వ‌చ్చాడ‌నుకోండి. ఆ పెద్దాయ‌న‌.. బాబు.. నా ద‌గ్గ‌ర న‌మ్మ‌క‌స్తుడైన కుర్రాడు ఉన్నాడు. అత‌డ్ని ప‌నిలో పెట్టుకుంటావా? అంటే.. పెట్టుకోకుండా ఉంటాడా? ఇదే రీతిలో రిల‌య‌న్స్ చెప్పిన మాట‌లు కూడా ఉన్నాయ‌ని చెప్పాలి.

త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణలు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న రిల‌య‌న్స్ సంస్థ‌.. యుద్ధ విమానాల‌ను త‌యారు చేసేది ఫ్రాన్స్ కు చెందిన ద‌సాల్ట్ కంపెనీ అని.. అది 36 రాఫెల్ ఫైట‌ర్ జెట్ల‌ను భార‌త్ కు స‌ర‌ఫ‌రా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంద‌ని పేర్కొన్నారు.

ఎగుమ‌తి చేసిన విడి భాగాల‌ను అమ‌ర్చే కాంట్రాక్టును ఆ సంస్థ త‌మ‌కు అప్ప‌గించిన‌ట్లుగా పేర్కొన్నారు. హెచ్ ఏఎల్ తో స‌హా భార‌త్ లోని ఏ సంస్థ‌కూ యుద్ధ విమ‌నానాల‌ను త‌యారు చేసే అనుభ‌వం లేద‌న్నారు. ర‌క్ష‌ణ శాఖ రూల్స్ ప్ర‌కారం విదేశీ సంస్థ‌ల‌తో భార‌త సంస్థ‌ల పార్ట‌న‌ర్ షిప్ విష‌యంలో ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు ఎలాంటి పాత్ర ఉండ‌దంటూనే.. ఆఫ్ సెట్ ల‌ను దేశంలో తొలిసారి 2005లో ప్ర‌వేశ పెట్టార‌న్నారు. త‌మ మాదిరే ఇప్ప‌టివ‌ర‌కూ 50 ఒప్పందాలు కుదిరిన‌ట్లుగా చెప్పారు. అర్థ‌మైందిగా.. రిల‌య‌న్స్ ఏం చెప్పాల‌నుకుంటుందో..?