Begin typing your search above and press return to search.

ఆటవేళ రూ.7 కోట్ల వాచ్ తో అదరగొట్టేస్తున్న టెన్నిస్ స్టార్

By:  Tupaki Desk   |   5 Oct 2020 12:15 PM IST
ఆటవేళ రూ.7 కోట్ల వాచ్ తో అదరగొట్టేస్తున్న టెన్నిస్ స్టార్
X
వాచ్ అన్నంతనే రూ.లక్ష.. 5లక్షల మాటను ఈ మధ్యన వింటున్నాం. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు సైతం ఖరీదైన వాచ్ లు ధరించటం ఈ మధ్యన ట్రెండ్ గా మారింది. ఇలాంటివేళ.. ఒక స్టార్ ఆటగాడి చేతికి ఉండే వాచ్ విలువ ఎంతై ఉంటుంది? అన్న ప్రశ్నను సంధిస్తే.. ఎవరి సమాధానమైనా రూ.కోటిని దాటే అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా.. టెన్నిస్ స్టార్ ఆటగాళ్లలో ఒకరైన రఫెల్ నడాల్ చేతికి పెట్టుకున్న వాచ్ మీద ఇప్పుడు అందరి కన్ను పడుతోంది.

దీనికి కారణం లేకపోలేదు. మ్యాచ్ వేళ నడాల్ ధరిస్తున్న ఈ వాచ్ విలువ తెలిస్తే నోట మాట రాదంతే. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో నడాల్ ధరిస్తున్న వాచ్ ఖరీదు అక్షరాల రూ.7 కోట్లకు పైనే చెబుతున్నారు. మరింత.. కచ్ఛితంగా దాని ధర చెప్పాలంటే రూ.7.39కోట్లుగా చెబుతున్నారు. నిరుడు ఫ్రెండ్ ఓపెన్ సింగిల్స్ విజేతగా నిలిచి.. తాజాగా జరుగుతున్న ఫ్రెంచ్ టోర్నీలోనూ టైటిల్ కు మరింత చేరువ అవుతున్నారు.

ఈ టోర్నీలో ఆయన పెట్టుకున్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్విట్జర్లాండ్ కు చెందిన లగ్జరీ వాచ్ ల తయారీ సంస్థ రిచర్డ్ మిల్ రూపొందించిన ఈ వాచ్ పేరు ఆర్ఎం 27-04గా పిలుస్తున్నారు. ఈ కంపెనీకి నడాల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వారిద్దరి భాగస్వామ్యం పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా అతగాడికి ఖరీదైన వాచ్ ను కట్టబెట్టింది సదరు కంపెనీ.

టెన్నిస్ రాకెట్ ఆకారంలో ఉండే ఈ వాచ్ బరువు మరో స్పెషల్ గా చెబుతున్నారు. చాలా పలుచగా.. బరువు తక్కువగా ఉండే ఈ వాచ్ మీద రఫా అని ముద్రించారు. నడాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించినఈ స్పెషల్ వాచ్ తో ఈ స్టార్ క్రీడాకారుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఖరీదైన వాచ్ తో మ్యాచ్ లకు దిగుతున్న స్టార్ ఆటగాడిగా అతడు నిలుస్తున్నాడు.కోట్లాది రూపాయిల విలువ చేసే వాచ్ పెట్టుకొని ఆటలోకి దిగుతున్న నేపథ్యంలో అతడి ఆట కంటే కూడా వాచ్ మీదనే ఎక్కువమంది గమనిస్తున్నట్లుగా చెబుతున్నారు.