Begin typing your search above and press return to search.

మరీ 7000 కిలోల బంగారమేటి రాజా?

By:  Tupaki Desk   |   19 Sep 2016 1:08 PM GMT
మరీ 7000 కిలోల బంగారమేటి రాజా?
X
బంగారం అక్ర‌మ ర‌వాణా అంటే మ‌హా అయితే కిలోల్లో జ‌రుగుతుంది అనుకుంటాం. విదేశాల నుంచి విమానాల్లో వ‌స్తూ బ్యాగుల్లో బంగారం తీసుకొస్తూ ఎయిర్ పోర్టుల్లో దొరుకుతున్న వారిని చూసి షాకైపోతుంటాం! కిలో బంగారం క‌నిపిస్తే అబ్బో అనేసి నోరెళ్ల‌బెట్టేస్తాం. అదే... ఏకంగా 7000 కిలోల బంగారాన్ని ర‌క‌ర‌కాల మార్గాల నుంచి అక్ర‌మంగా త‌ర‌లించిన వైనం గురించి తెలిస్తే ఎలా ఉంటుంది..? దిమ్మ‌దిరిగిపోదూ! స‌రిగ్గా ఇలాంటి స్మ‌గ్లింగే ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. ఏడువేల కిలోల బంగారు అక్ర‌మ ర‌వాణా గుట్టుర‌ట్టు చేశారు డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్‌.ఐ.) అధికారులు. మ‌న‌దేశం చ‌రిత్ర‌లోనే అతిపెద్ద స్మ‌గ్లింగ్ వివ‌రాల‌ను సోమ‌వారం నాడు మీడియాకు వివ‌రించారు. రోడ్డు - గ‌గ‌న‌ - జ‌ల ర‌వాణా మార్గాల‌ను ఏ విధంగా వినియోగించుకుని ఈ అక్ర‌మ ర‌వాణా సాగించారో ఆ వైనాన్ని వెల్ల‌డించారు.

ఇంత‌కీ ఈ స్మ‌గ్లింగ్ వివ‌రాలు ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే... కొద్ది రోజుల కింద‌ట ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారుల‌ దృష్టికి ఓ విష‌యం వ‌చ్చింది. గువ‌హాటీ నుంచి ఢిల్లీకి ఒక కార్గో విమానం వ‌చ్చింది. దాన్ని త‌నిఖీ చేస్తే అందులో దాదాపు ప‌ది కిలోల బంగారాన్ని క‌నుగొన్నారు. ఇదంతా స్వ‌చ్ఛ‌మైన 24 క్యారెట్స్ గోల్డ్‌. ఇంత స‌రుకు అక్ర‌మంగా ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్తోంద‌న్న కోణంలో ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. అక్క‌డి నుంచి డొంక క‌ద‌ల‌డం మొద‌లైంది. కార్గో మీద ఉన్న చిరునామాలో గువ‌హాటి నుంచి ఎవ‌రు పంపారు వారిని అదుపులో తీసుకున్నారు. ఢిల్లీలో డెలివ‌రీ అడ్రెస్ మీద ఉన్న వివ‌రాల‌ను వాక‌బు చేసి ఇంకో వ్య‌క్తినీ అరెస్టు చేశారు. ఈ ఇద్ద‌రినీ ద‌ర్యాప్తు చేయ‌డం మొద‌లు పెడితే క‌ళ్లు బైర్లుగ‌మ్మే వాస్త‌వాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కి రావ‌డం మొద‌లైంది.

మ‌య‌న్మార్ నుంచి మ‌న‌దేశంలోకి అక్ర‌మ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బంగారం స్మ‌గ్లింగ్ అవుతోంద‌ని అధికారులు గుర్తించారు. మ‌య‌న్మార్ నుంచి గువ‌హాటీకి స్మ‌గ్ల‌ర్లు బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా చేర్చుతారు. అక్క‌డి నుంచి కార్గో విమానాల్లో రాజ‌ధాని ఢిల్లీతో స‌హా దేశంలోని వివిధ ప్రాంతాల‌కు అక్ర‌మ బంగారం చేర్చేవార‌ని అధికారులు చెప్పారు. ఇంత‌వ‌ర‌కూ ఇలా 617 సార్లు స్మ‌గ్లింగ్ బంగారం గువ‌హాటీ నుంచి దేశంలోకి వ‌చ్చింది. స్మ‌గ్లింగ్ అయిన బంగారం 7 వేల కిలోలు ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. చిత్రం ఏంటంటే... 617 సార్లు స్మ‌గుల్డ్ గోల్డ్ కార్గో విమానాల్లో ఎలా వ‌చ్చింద‌నేది? ఎందుకంటే, ఇంత భారీ ఎత్తున అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతుందో ఒక్క‌టంటే ఒక్క‌సారైనా విమాన‌యాన సిబ్బందికి అనుమానం రాలేదా..? ఈ స్మ‌గ్లింగ్ వెనుక కొంత‌మంది విమాన‌యాన సిబ్బందిని కూడా అనుమానించాల్సి వ‌స్తోంది. ఈ కోణంలో కూడా ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఒక‌టా రెండా.. ఏడే వేల కిలోల బంగారం అక్ర‌మ ర‌వాణా అంటే మాట‌లా..?