Begin typing your search above and press return to search.

దేవుళ్ల‌పై అనుచిత పోస్టులు..యువ‌కుడి అరెస్టు!

By:  Tupaki Desk   |   29 Dec 2017 12:20 PM GMT
దేవుళ్ల‌పై అనుచిత పోస్టులు..యువ‌కుడి అరెస్టు!
X
గ‌తంలో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించాలంటే ప్రింట్ లేదా ఎల‌క్ట్రానిక్ మీడియాను ఆశ్ర‌యించ‌క త‌ప్పేది కాదు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ జ‌మానాలో సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ ఎవ‌రికి తోచిన అభిప్రాయాల‌ను వారు నిర్భయంగా వెల్ల‌డిస్తున్నారు. అయితే - ఈ సోష‌ల్ మీడియాను చాలా మంది మంచికి ఉప‌యోగిస్తుంటే....మ‌రికొంత మంది మాత్రం త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు - ఇత‌రుల‌ను కించ‌ప‌రిచేందుకు వాడుకుంటున్నారు. మ‌రికొంద‌రైతే వేరే కులాలు - పార్టీలు - మ‌తాల‌పై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌త్యేకంగా కొన్ని అభ్యంత‌ర‌క‌ర‌ - అనుచిత‌ - అన‌వ‌స‌ర పోస్టులు పెడుతూ....త‌మ‌కు దొరికిన అమూల్య‌మైన భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు జిల్లాలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడు ఎమ్మెస్పీ పూర్తి చేశాడు. ఇంత చ‌దువు చ‌దివిన విన‌య్ ....సంస్కార హీనంగా ప్ర‌వ‌ర్తించాడు. ప‌ర‌మ‌త స‌హ‌నానికి ప్ర‌తీకగా నిలిచిన భార‌త దేశంలో పుట్టి.....పైశాచికంగా ప్ర‌వ‌ర్తించాడు. సోష‌ల్ మీడియాలో త‌న‌కు దొరికిన స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేసుకున్నాడు. విన‌య్....హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఫేస్ బుక్ లో అభ్య‌తర‌క‌ర‌ - అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. దీనిని గ‌మ‌నించిన కొంద‌రు అత‌డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దేవుళ్లపై ఇటువంటి పోస్టులు చేస్తూ తమ మనోభావాలు దెబ్బ‌తీస్తున్నాడంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో, రంగంలోకి దిగిన రాచకొండ సైబర్‌ సెల్‌ పోలీసులు.....ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డుతున్న విన‌య్ ను అరెస్ట్ చేశారు. భవిష్య‌త్తులో మ‌రెవ‌రూ ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఉండేలా అత‌డికి క‌ఠిన శిక్ష విధించాల‌ని ప‌లువురు కోరుతున్నారు. రాజ్యాంగం త‌మ‌కు ఇచ్చిన స్వేచ్ఛ‌ను ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ఈ రకంగా ప్ర‌వ‌ర్తించి ఇత‌రుల మ‌న‌సులు గాయ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.