Begin typing your search above and press return to search.

బెజ‌వాడ సంగీత‌..భాగ్య‌న‌గ‌రి డ్ర‌గ్స్ లో లేడీ డానేనా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 11:02 AM GMT
బెజ‌వాడ సంగీత‌..భాగ్య‌న‌గ‌రి డ్ర‌గ్స్ లో లేడీ డానేనా?
X
భాగ్య న‌గ‌రి హైద‌రాబాదునే కాకుండా యావ‌త్తు తెలుగు నేల‌ను ఓ కుదుపు కుదిపేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించి ఇప్పుడు కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చిన అంశం పెను క‌ల‌క‌ల‌మే రేపేలానే ఉంది. మొన్న‌టిదాకా డ్ర‌గ్స్ దందాతో తెలుగు చిత్ర‌సీమ టాలీవుడ్ నానా ఇబ్బందులు ప‌డింది. టాలీవుడ్‌ కు చెందిన టాప్ హీరో ర‌వితేజ‌తో పాటు టాప్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ - ప్ర‌ముఖ హీరోయిన్ చార్మీ - మ‌రికొంద‌రు న‌టుల‌ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. ఈ విచార‌ణ‌లో భాగంగా ఆయా న‌టులు వెల్ల‌డించిన వివ‌రాల‌పై తెలుగు మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియా కూడా లెక్క‌కు మిక్క‌లి క‌థ‌నాల‌ను రాసేసింది. ఈ వార్త‌ల‌పై జ‌నంలో పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా జ‌రిగింది.

అయితే తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఉదంతంతో న‌వ్యాంధ్ర పొలిటిక‌ల్ కేపిట‌ల్‌ గా ఎదుగుతున్న విజ‌య‌వాడ‌కు సంబంధాలున్నాయ‌ని తేల‌డం ఇప్పుడు మ‌రో క‌ల‌క‌ల‌మే రేగిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ విష‌యానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకెళితే... కెల్విల్ నేతృత్వంలోని డ్ర‌గ్స్ ముఠా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన త‌ర్వాత మ‌రిన్ని దాడులు చేసిన పోలీసులు... మ‌రో నైజీరియ‌న్ ముఠాను పట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ ముఠాలో విజ‌య‌వాడ‌కు చెందిన సంగీత అనే ఓ మ‌హిళ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అమాయ‌కులైన యువ‌త‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌డమే కాకుండా వ్య‌భిచారం కూడా నిర్వ‌హిస్తున్న సంగీత... త‌న మాట విన‌ని యువ‌తుల‌ను లొంగదీసుకునేందుకు వారికి చెందిన న్యూడ్ ఫొటోల‌ను అస్త్రంగా చేసుకుని చ‌క్రం తిప్పుతోంద‌ట‌.

మూడు రోజుల పాటు జ‌రిగిన విచార‌ణ‌లో భాగంగా సంగీత ఈ ఆశ్చ‌ర్య‌క‌ర నిజాల‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు స‌మాచారం. ప్రియుడు జాన్‌ తో కలిసి సంగీత నగర శివారులోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు డ్రగ్స్‌ సప్లయి చేస్తున్న సంగీత ఉచ్చులో... బంజారాహిల్స్‌కు చెందిన పలువురి ప్రముఖుల పిల్లలు తేలింద‌ట‌. ఇందుకు సంబంధించి ఆరుగురిని ప్రశ్నించిన పోలీసులు, వారి రక్త నమూనాలును సేకరించారు. సంగీత‌కు సంబంధించిన వివ‌రాల్లోకెళితే... విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్‌ బుక్‌ లో సూడాన్‌ కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్‌ కు మకాం మార్చగా.. ఆ సూడాన్‌ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్ - అతడి స్నేహితులతో పరిచయమైంది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్‌ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్‌ సిటీలో ఓ ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్‌ తో కలసి ఉంటోంది. కాస్మోస్‌ గాబ్రిల్‌ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్ - బ్రౌన్‌ షుగర్ - అంఫిటమైన్‌ టాబ్లెట్‌ లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్‌ ఒకొరి - సిరిల్ - హెన్రీ - సంగీతలతో కలసి హైదరాబాద్‌ లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా - డెబిట్‌ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్ - సిరిల్‌ లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్‌ వోటీ - ఎల్‌ బీ నగర్‌ పోలీసులు నిఘాపెట్టారు.

ఈ క్రమంలోనే గతనెల 23న ఎల్‌ బీనగర్‌ బస్ స్టాపులో సంగీతను - జాన్‌ ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్ - 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్‌ సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్‌ ను అరెస్టు చేసి - డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్‌ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌ జిల్లా యాప్రాల్‌ లోని తిరు అపార్ట్‌ మెంట్‌ లో - సిరిల్‌ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్బన్ సెర్చ్‌ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.