Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ గేర్

By:  Tupaki Desk   |   17 Dec 2016 11:41 AM GMT
ఆ టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ గేర్
X
టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనదైన సొంత ఎజెండాతో ముందుకు సాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత‌ ఆర్. కృష్ణయ్య మ‌రోమారు అనూహ్య కామెంట్ చేశారు. శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ త‌ర‌ఫున ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే నిరంతర విద్యుత్ సాధ్యమైందని కొనియాడారు. సీఎం చొరవతో గతంలో కంటే మెరుగైన విద్యుత్‌ ను పొందుతున్నామని తెలిపారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం సంతోషంగా ఉందని ఆర్.కృష్ణ‌య్య ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ఆర్ కృష్ణ‌య్య త‌న‌దైన శైలిలో కొన్ని సూచ‌న‌లు చేశారు. సోలర్ ప్యానెల్స్ మీద రైతులకు సబ్సిడీ ఇవ్వాలన్నారు. సోలార్ విద్యుత్ మీద రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్ర‌భుత్వం విద్యుత్ స‌ర‌ఫ‌రా బాగానే చేస్తున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు అధికారుల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని తెలిపారు. రైతుల‌కు ఉన్న స‌మ‌స్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వం మ‌రింత దృష్టిపెడితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆర్‌.కృష్ణ‌య్య సూచించారు.

మ‌రోవైపు ఆర్‌.కృష్ణ‌య్య ప్ర‌శంస‌పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ ను సరఫరా చేస్తున్నామని, ఇది తెలంగాణ ప్ర‌భుత్వ హ‌యాం ఘ‌న‌త అని అన్నారు. దరఖాస్తు పెట్టుకున్న రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మే నెల నాటికి 94వేలకు పైగా వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాడైన సబ్‌స్టేషన్లను 24 గంటల్లోపే బాగు చేస్తున్నామని తెలిపారు. నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా నేప‌థ్యంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి వెల్లడించారు. విద్యుత్ శాఖలో 20 వేలమంది ఔట్‌ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్దీకరిస్తామని, ఇప్పటికే 1100 మందికి పైగా క్రమబద్దీకరించామని గుర్తు చేశారు. గృహ వినియోగానికి 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/