Begin typing your search above and press return to search.

కాపులకు బీసీ కౌంటర్ రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   2 Feb 2016 6:38 AM GMT
కాపులకు బీసీ కౌంటర్ రెడీ అవుతోంది
X
కాపు గర్జన పేరుతో హింసకు దిగి ప్రభుత్వాన్ని డిఫెన్సులో వేసిన కాపు నేతలకు కౌంటర్ గా బీసీ గర్జన నిర్వహించేందుకు బీసీ సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే సహించేది లేదని, ప్రభుత్వం మెడలు వంచయినా రిజర్వేషన్లను అడ్డుకుంటామని బీసీ సంఘాలు, నేతలు హెచ్చరిస్తున్నారు. కాపులకు బీసీల హోదా వ్యవహారం ఏపిలో బీసీలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కనిపిస్తోంది. కాపులకు బీసీ హోదా ఇస్తే రోడ్లపైకొచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దానికోసం కాకినాడలో భారీ బహి రంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాపులు ప్రభుత్వాన్ని బెదిరిం చేందుకే తునిలో ఘర్షణలు సృష్టించారని భావిస్తున్న బీసీలు, ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వం బెదిరింపులకు తలొగ్గితే తాము కూడా జిల్లాకో సభ నిర్వహించి, రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. వారి కంటే తమ జనాభా సంఖ్య ఎక్కువన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలంటున్నారు.

మరోవైపు కాపులకు బీసీల హోదాపై తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరిని సొంతపార్టీ ఎమ్మెల్యే - బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపిలోని కొన్ని పట్టణాల్లో పర్యటించిన కృష్ణయ్య ప్రాణాలొడ్డయినా కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటామని, అవసరమైతే బీసీలంతా రోడ్లపై కొచ్చి కూర్చుంటామని హెచ్చరిస్తున్నారు.

కాపులను బీసీల్లో చేర్చితే సర్పంచ్ - ఎంపీటీసీ - జడ్‌ పిటీసీ - కౌన్సిలర్ - కార్పొరేటర్ ఎన్నికలలో మొత్తం రిజర్వేషన్లు కాపులే కొట్టేస్తారని బీసీ సంఘాలు అంటున్నాయి. ఓబీసీ కోటాలోనూ వారి డామినేషన్ పెరిగిపోతుందని అంటున్నారు. బీసీలను దూరం చేసుకుంటే టిడిపికి పుట్టగతులు ఉండవని.. టిడిపికి కాపులు కావాలా? బీసీలు కావాలో చంద్రబాబు చెప్పాలని బీసీ నేతలు డిమాండు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.