Begin typing your search above and press return to search.

గమనించారా?; క్యూలైన్లు తగ్గాయి సుమా

By:  Tupaki Desk   |   17 Nov 2016 3:56 AM GMT
గమనించారా?; క్యూలైన్లు తగ్గాయి సుమా
X
నేటికి సరిగ్గా పది రోజులైంది. పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకొని. మంగళవారం రాత్రి 8గంటల వేళ దేశ ప్రజలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా నిర్ణయం తీసుకున్న ఆయన.. బుధవారం ఏటీఎంలు బ్యాంకులు పని చేయమని తేల్చారు. గురువారం నుంచి బ్యాంకులు పని చేయటం మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ఏటీఎంలు పని చేయటం ప్రారంభించాయి.అయితే.. మధ్యలో గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇది మినహా మిగిలిన రోజులన్నీ బ్యాంకులు పని చేశాయి. మొదటి మూడు నాలుగు రోజులు భారీ ఎత్తున క్యూలు బ్యాంకుల ఎదుట దర్శనమిచ్చాయి. ఏటీఎం సెంటర్లు అయితే.. చెప్పాల్సిన అవసరమేలేదు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఏటీఎం సెంటర్లు జనంతో పోటెత్తాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలుచోవటంపై సామాన్యులు చిరాకును.. ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నోట్ల కొరత భారీగా ఉండటం.. రూ.500 నోట్లను ఆలస్యంగా విడుదల చేయటం.. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవటంతో చిల్లర నోట్ల కోసం ప్రజలు తీవ్రంగా అవస్థలు పడాల్సిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు తర్వాత శని..ఆదివారాల్లో ప్రజలు తమ మిగిలిన పనుల్ని వదిలేసి.. బ్యాంకుల ముందు బారులు తీరటం కనిపించింది. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంపై కొందరు ప్రజలు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. దీంతో.. విపక్షాలు ప్రధాని తీసుకున్ననిర్ణయాన్ని తప్పు పడుతూ గళం విప్పాయి. ఇదిలా ఉంటే.. మంగళవారంతో పోలిస్తే.. బుధవారం తొలిసారి బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుముఖం పట్టటం గమనార్హం. జాతీయ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో దాదాపు యాభై శాతం మార్పులు వచ్చినట్లుగా బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ బ్యాంకుల వద్ద మాత్రం రద్దీలో 20 శాతం మాత్రమే తగ్గిందని చెబుతున్నారు. క్యాష్ డిపాజిట్లు వేసే వారు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నారని.. అందుకు భిన్నంగా క్యాష్ విత్ డ్రా మీద ఎక్కువ ఫోకస్ పెరిగిందని చెబుతున్నారు. ఏటీఎంలు సరిగా పని చేయకపోవటం.. చెక్కుతో విత్ డ్రా చేసుకునేందుకు లిమిట్ రూ.24వేలు ఉన్న నేపథ్యంలో.. బ్యాంకుకు వెళ్లి డ్రాచేసుకునే అంశం మీదనే ప్రజలు ఎక్కువ ఫోకస్ పెట్టటం కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏటీఎంలలో డబ్బును పెద్ద ఎత్తున పెట్టేసి.. క్యాష్ విత్ డ్రా మొత్తాన్ని పెంచిన పక్షంలో.. బ్యాంకుల వద్ద క్యూలైన్లను మరింత తగ్గించొచ్చన్న వాదన వినిపిస్తోంది. మరి.. ప్రభుత్వ పెద్దలకు.. కీలక అధికారులకు ఇలాంటి సలహాలు.. సూచనలు వినిపిస్తాయో? లేదో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/