Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు

By:  Tupaki Desk   |   22 July 2021 7:30 AM GMT
ఇన్నాళ్లకు కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు
X
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతిపక్షాలను పద్ధతి ప్రకారం నీరుగారుస్తూ ఎదురేలేకుండా చేసుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ప్రతిపక్ష కాంగ్రెస్ లోని దిగ్గజ నాయకులను ఇప్పటికే లాగేశారు. అందులోని నాయకులను నయానో భయానో కానీ నోళ్లు మూయించారు. అసలు ఎదురే లేకుండా తెలంగాణను ఏలుతున్న కేసీఆర్ ను ఇప్పుడు ప్రతిపక్షాలు చుట్టుముడుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులతో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతిపక్షాల నుంచి ఎదురులేకుండా తిరుగులేకుండా పాలించిన కేసీఆర్ కు ఇప్పుడు కష్టాలు వచ్చాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడం.. షర్మిల కొత్త పార్టీ పెట్టడం.. బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ రావడంతో ఇప్పుడు ఈ ముగ్గురు యువ నాయకుల ఆందోళనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

గత రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజల కడుపు నిండేలా కేసీఆర్ చేసిన లాబీయింగ్ ఫలించింది. వాళ్ల ఇంటిపార్టీగా ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్ర వేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. దీంతో తెలంగాణలో ఇక కేసీఆర్ కు ఎదురేలేకుండా పోయింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రత్యర్థి పార్టీలన్నీ కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నాయి.

ఇన్నాళ్లు ఇతర పార్టీలను బలహీన పరిచిన కేసీఆర్ కు ఇప్పుడు బలంగా తయారవుతున్న ప్రతిపక్షాలు కలవరం పడుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నాయకులందరిని టీఆర్ఎస్ లోకి లాగేసిన కేసీఆర్ వాటిని నిర్వీర్యం చేసినా ఇప్పుడు కొత్త రక్తంతో సరికొత్తగా దూసుకొచ్చిన పార్టీల తీరు గులాబీ పార్టీని ఆందోళన కలిగిస్తోంది.

ఇన్నాళ్లు ప్రశ్నించే దమ్మున్న నాయకులు ప్రతిపక్షంలో లేకపోవడం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఇప్పుడు ఓ వైపు రేవంత్ రెడ్డి, మరో వైపు బండి సంజయ్, ఇంకో వైపు షర్మిల కూడా స్పీడు పెంచి దూకుడుగా రాజకీయం చేస్తుండడంతో కేసీఆర్ సర్కార్ కార్నర్ అవుతోంది.

బండి సంజయ్ సరైన ప్రత్యర్థిగా కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనడంతో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హవా కొనసాగించారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపీకయ్యాక కాంగ్రెస్ కు కొండంత బలం వచ్చింది.

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ అక్కడ విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ సమయంలో భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటల రాజేందర్ ఇప్పుడక్కడ బలంగా తయారయ్యాడు. మరో వైపు రేవంత్ రెడ్డి దూకుడు పనిచేస్తోంది. ఇక షర్మిల సైతం విమర్శలతో టీఆర్ఎస్ ను ఇరుకునపెడుతోంది.

ఇలా అందరూ ఒక్కసారిగా కేసీఆర్ పై వచ్చి పడడంతో టీఆర్ఎస్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న ఈటల సంచలన ఆరోపణలతో టీఆర్ఎస్ ను దెబ్బతీస్తున్నారు. ఇక పెట్రోల్, డీజీల్ ధరల పెంపును , ఫోన్ ట్యాపింగ్ లను రేవంత్ అస్త్రంగా చేసుకొని టీఆర్ఎస్ ను ఇరుకునపెడుతున్నారు. ఇక నిరుద్యోగ సమస్యతో షర్మిల ఇరుకునపెడుతోంది.

మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ తనదైన రాజకీయ చతురతతో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు? లేదంటే కేసీఆర్ కే ఇది ఎఫెక్ట్ అవుతుందా? అన్నది వేచిచూడాలి.