Begin typing your search above and press return to search.

చిన్ననోట్ల కొరత ఎంతకాలం సాగనుంది?

By:  Tupaki Desk   |   13 Nov 2016 4:50 AM GMT
చిన్ననోట్ల కొరత ఎంతకాలం సాగనుంది?
X
పెద్ద నోట్లు రద్దు ఇప్పుడు పాత వార్త. ఈ విషయాన్ని ప్రధాని ప్రకటించి నాలుగు రోజులైంది. చిన్న నోట్లు.. సరికొత్త రూ.2వేల నోటు ఒకరోజు వ్యవధిలో బయటకు రానున్నట్లుగా చెప్పి.. నోట్లకు ఎలాంటి ఇబ్బందుల్లేవు రెండు రోజుల్లో మొత్తం సెట్ అవుతుందని ప్రభుత్వం చెప్పిన మాటా పాతదే. ప్రభుత్వం చెప్పినట్లుగా గడిచిన నాలుగు రోజుల్లో ప్రజలకు అవసరమైన నగదు ప్రజల చేతికి వచ్చిందా? అన్న ప్రశ్న వేసుకుంటేనే అసలు ఇబ్బందేమిటో అర్థమయ్యే పరిస్థితి. చిల్లర నోట్ల కోసం బ్యాంకుల వద్ద.. ఏటీఎంల వద్దా కనిపిస్తున్న క్యూను చూస్తే గుండె బేజారయ్యే పరిస్థితి. క్రెడిట్ కార్డులతో కాలం గడిపే అలవాటున్న చాలామంది జేబులో ఉన్న వంద.. రెండు వందలతో సర్దుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

మూడు.. నాలుగు రోజులు.. కాకుంటే మరో రెండు మూడు రోజులు ఓపిక పడితే.. ఏటీఎంల వద్ద ఉన్న క్యూలు తగ్గిపోతాయని.. బ్యాంకుల దగ్గర స్టార్ హీరో సినిమా టికెట్ల కోసం బారులు తీరే చందంగా ఉన్న జనసందోహం తగ్గిపోతుందని లెక్కలు వేశారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. అలా వేసుకున్న అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. ప్రభుత్వం ప్రకటించిన డిసెంబరు 30 వరకూ బ్యాంకుల వద్ద సందడి మరింత పెరగటమే తప్పించి తగ్గేది కాదన్నట్లుగా కనిపిస్తోంది. ఏటీఎంలలో డబ్బులు అందుబాటులోకి వస్తాయని చెప్పినా.. వాటిల్లో క్యాష్ లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో చేదు నిజం ఏమిటంటే.. కొత్తగా ప్రభుత్వం బయటకు విడుదల చేసిన కొత్త నోట్లు (రూ.2వేలు) ఏటీఎంలలో రాని పరిస్థితి. ఎందుకిలా ఉంటే.. కొత్త నోట్లకు తగ్గట్లుగా దేశ వ్యాప్తంగా ఏటీఎంలను మార్చాల్సి ఉంది. ఆ కార్యక్రమం ఇప్పటివరకూ జరగలేదు.

అంటే.. కొత్త నోట్లకు తగ్గట్లుగా ఏటీఎం ప్రోగ్రాం మార్చే వరకూ రూ.100 నోట్లు తప్పించి మరో నోటుబయటకు రాని పరిస్థితి. తడవకు వచ్చే రూ.2వేల మొత్తం కోసం గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవటం.. చిల్లర నోట్ల కోసం ప్రయత్నించటం లాంటి వాటితోపాటు.. చేతికి వచ్చిన డబ్బును ఖర్చు చేయటం ద్వారా.. మళ్లీ చిల్లర నోట్ల కోసం ఏటీఎంల వద్ద క్యూలో నిలుచునే పరిస్థితి.

ఇంకా బాగా అర్థమయ్యేందుకు మరింత వివరంగా చెప్పాల్సి వస్తే.. చిల్లర నోట్ల కోసం ‘ఎ’ అనే వ్యక్తి ఏటీఎం క్యూలో నిలుచున్నాడు. రెండు.. మూడు గంటల నిరీక్షణ తర్వాత అతని చేతికి పరిమిత మొత్తం చేతికి వచ్చింది. దాన్ని వెంటనే ఖర్చు పెడతాడే తప్పించి.. దాచి ఉంచలేడు. ఖర్చు విషయంలో గతంలో మాదిరి కాకుండా కాస్త ఆచితూచి ఖర్చు చేస్తారనే అనుకుందాం. అలా చూసుకున్నా.. వారం తర్వాత సదరు ‘ఎ’ వ్యక్తి మళ్లీ ఏటీఎం వద్దకు రావాల్సిందే. అదే సమయంలో.. రద్దీ తగ్గిన తర్వాత ఏటీఎం వద్దకు వెళదామని అనుకునే ‘బీ’ లాంటి వారు రానున్న రోజుల్లో ‘ఎ’కు జత కానున్నారు.

అంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పటికే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న వారితో పాటు.. డబ్బులు తీసుకోని వారు సైతం ఏటీఎం సెంటర్లకు రానున్న రోజుల్లో రానున్నారు. అదే జరిగితే.. నోట్ల కోసం తిప్పలు మరింత పెరగటం ఖాయమని చెప్పాలి. ఇదిలా ఉంటే.. కొత్తగా వచ్చిన పెద్ద నోట్లు ఏటీఎంలలో విడుదలైతే కొంత మేర సమస్యలు తీరే అవకాశం ఉంది. కానీ.. ఈ కొత్త నోట్లను విడుదల చేసేలా ఏటీఎంలను మార్చలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను మార్పులు చేసేందుకు కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతుందని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో రీకాలిబ్రేషన్ చేయటానికి పట్టే సమయంతో పాటు.. పెద్ద ఎత్తున ఈ పని చేయటానికి భారీగా నిపుణులు అవసరమవుతారు. ఆ ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక కానీ కొత్త పెద్ద నోట్లు అందుబాటులోకి రావు. అప్పుడే సమస్య కొంత తగ్గే వీలుంది. ఎందుకంటే.. రూ.2వేలు డ్రా చేసినప్పుడు వంద నోట్లు అయితే 20 వస్తాయి. అదే.. వెయ్యి అయితే రెండు నోట్లు.. రూ.500 నోట్లు అయితే నాలుగు వస్తాయి. అంటే ఏటీఎం మెషిన్లో పెట్టే నోట్ల సంఖ్య పరిమితంగా ఉన్న నేపథ్యంలో పెద్ద డినామినేషన్ నోట్లు పెడితే.. ఎక్కువ మంది ప్రజలకు నోట్లు చేరే అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే ఏటీఎంలలో మార్పులు జరగాలి.

ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో చిల్లర నోట్లతో పాటు.. అవసరమైన మొత్తం చేతికి రావటానికి ప్రభుత్వం చెప్పినట్లుగా నిజమయ్యే అవకాశం తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటిగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావటానికి కొద్ది కాలం పడుతుందన్నభావన వ్యక్తమవుతోంది. ఇదే అంచనా నిజమైతే.. నోట్ల కష్టాలు డిసెంబరు మధ్య వరకూ పక్కా ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది. నగరాల్లో పరిస్థితి కాస్త త్వరగానే మెరుగైనా.. ప్లాస్టిక్ మనీ చెల్లుబాటు అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ ఇబ్బంది మరింత కాలం కొనసాగటం ఖాయమని చెప్పాలి. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోకుంటే మాత్రం ఏటీఎం.. బ్యాంకు కష్టాలు భారీగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. నాలుగైదు రోజుల్లో బ్యాంకుల దగ్గర.. ఏటీఎంల దగ్గర పరిస్థితి మారిపోతుందని.. అప్పుడు వెళ్లొచ్చొని జేబులో ఉన్న ఆఖరి రూపాయి ఖర్చు పెట్టేసే వరకూ ఏటీఎంలలో డ్రా చేయకుండా ఉంటే మాత్రం తిప్పలు తప్పవు. బీ అలెర్ట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/