Begin typing your search above and press return to search.

క్వీన్ ఎలిజబెత్..మహ్మద్ ప్రవక్త వారసురాలట!

By:  Tupaki Desk   |   9 April 2018 5:52 PM GMT
క్వీన్ ఎలిజబెత్..మహ్మద్ ప్రవక్త వారసురాలట!
X
మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లైంది. మొరాకో దేశానికి చెందిన ఓ పత్రిక ఇప్పుడో వింత వాదాన్ని తెరపైకి తెచ్చింది. అసలు ఇప్పుడున్న క్వీన్ ఎలిజబెత్ ఎవరో కాదు.. మహ్మద్ ప్రవక్త వారసురాలే అంటూ ద మొరకన్ అనే పత్రిక ఓ కథనం వెలువరించింది. ఓ అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు ఆ పత్రిక చెప్పింది. నిజానికి ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను 1986లో ప్రచురించినట్లు డైలీ మెయిల్ వెల్లడించింది. ఇప్పుడీ మొరకన్ పత్రిక ఆ అధ్యయనాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. క్వీన్ ఎలిజబెత్‌కు సంబంధించిన 43 తరాల పూర్వీకులపై అధ్యయనం జరుపుతూ వెళ్లగా ఆమె మహ్మద్ ప్రవక్తకు దూరపు బంధువు అని తేలినట్లు ఆ పత్రిక చెబుతోంది.

మ‌హ్మ‌ద్‌ ప్రవక్త కూతురు ఫాతిమాకు ఎలిజబెత్‌ కు రక్త సంబంధం ఉన్నట్లు ఆ అధ్యయనం తేల్చిందని మొరకన్ తెలిపింది. కొందరు చరిత్రకారులు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నా.. మధ్య యుగపు స్పెయిన్‌ కు చెందిన వారసత్వపు రికార్డులు మాత్రం ఇది నిజమేనని చెబుతుండటం గమనార్హం. ఈజిప్ట్‌కు మాజీ మత గురువు అలీ గోమా ఈ విషయాన్ని ధృవీకరించారు. `బ్రిటన్‌ లో చాలా కొద్ది మందికే తెలిసిన నిజమిది. క్వీన్‌లో ప్రవక్త రక్తం ప్రవహిస్తోంది. ఇది ముస్లిం మతపెద్దలందరికీ ఎంతో గర్వకారణమైన విషయం అని 1986లో అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు రాసిన లేఖలో అలీ చెప్పారు. క్వీన్ ఎలిజబెత్ ముస్లిం యువరాణి జైదా వంశానికి చెందినవారు కావచ్చని అప్పటి అధ్యయనం తేల్చింది. ఈ జైదా అనే ముస్లిం యువరాణి 11వ శతాబ్దంలో తన సొంతూరు సెవిల్ నుంచి వెళ్లిపోయి తర్వాత క్రిస్టియానిటీలోకి మారిందని అంచనా వేస్తున్నారు. ఈ జైదా కుమారుడి వారసుల్లో ఒకరు 11వ శతాబ్దంలో ఎర్ల్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా, ఈ ప‌రిణామంపై క్వీన్ వంశ‌స్తులు అధికారికంగా స్పందించ‌లేదు.