Begin typing your search above and press return to search.

ఇదీ అసలు సంగతి:కటీఫ్ అంటే కమలానికి భయమే!

By:  Tupaki Desk   |   19 Feb 2018 1:30 PM GMT
ఇదీ అసలు సంగతి:కటీఫ్ అంటే కమలానికి భయమే!
X
ఏదో దూకుడులో నిన్న పార్టీ పదాధికారులంతా గుమికూడి కనిపించే సరికి తమ బలం - బలగం చాలా ఉన్నదని అనుకుని.. ఆ ఆవేశంలో మాట్లాడేశారుగానీ.. నిజానికి ఏపీలో భాజపా వారికి కూడా.. తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలంటే.. భయంగానే ఉంది. ‘ఇప్పుడు మేం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని దూరం చేసుకోలేం’ అని నిన్న రాజీనామాకు కూడా సై అన్న మంత్రి పైడికొండ మాణిక్యాల రావు స్వయంగా ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది.

ఎందుకు దూరం చేసుకోలేరు? ఏంటి అంతగా తెదేపా మీద భాజపా ఆధారపడిపోయిన పరిస్థితి? అనే సందేహం ప్రజలకు కలగవచ్చు. కానీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మాత్రం చాలా ప్రాక్టికల్ గా ఉన్న ఇబ్బందులను వివరించారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న ఎన్డీయే నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక పార్టీలు దూరం అవుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అతి కీలక - పెద్ద భాగస్వామి అయినా తెలుగుదేశాన్ని దూరం చేసుకోలేం అని ఆయన చెబుతున్నారు.

ఎన్డీయే నుంచి మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటనలు వచ్చినప్పుడే ఒదిశాలోని బీజేడీ లాంటి పార్టీలు దూరం అయ్యాయి. మోడీ సారథ్యంలో గద్దె ఎక్కిన తరువాత.. పెద్ద భాగస్వామి శివసేన - తర్వాత అకాలీదళ్ కూడా దూరం అయ్యాయి.. ఇలాంటి నేపథ్యంలో పెద్ద పార్టీలన్నీ వెళ్లిపోతుండగా.. తెలుగుదేశం కూడా వెళ్లడాన్ని తాము కోరుకోవడం లేదని మంత్రి అన్నారు.

మంత్రి ప్రకటన నేపథ్యంలో రెండు అంశాలు తెర వెనుక జరిగి ఉండవచ్చుననే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. 1- తెలుగుదేశం సంతృప్తిగా స్పందించేలా.. పార్లమెంటు సమావేశాల్లోగా.. కేంద్రం నుంచి ఏదో ఒక కేటాయింపులకు సంబంధించిన ప్రకటన రావొచ్చు. 2- కటీఫ్ వల్ల ఏపీలో కూడా పార్టీ దారుణంగా దెబ్బతినిపోతుందనే అభిప్రాయం అధిష్టానం నుంచి వచ్చి ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో.. కటీఫ్ తో మాకు నష్టం అని మంత్రి గారు హుందాగా అంటున్నారు గానీ.. కటీఫ్ తో ఇద్దరికీ నష్టమే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు చప్పుడు చేయకుండా.. పైకి మాత్రం రంకెలు వేస్తూ రోజులు గడిపేస్తున్నారనే సంగతిని ప్రజలంతా గుర్తిస్తున్నారు.