Begin typing your search above and press return to search.

హోదా గోదాలోకి చిరంజీవిని లాగిన మాణిక్యం

By:  Tupaki Desk   |   1 Aug 2016 10:47 AM GMT
హోదా గోదాలోకి చిరంజీవిని లాగిన మాణిక్యం
X
ప్రత్యేక హోదాపై ఏపీలో నేతలంతా స్పీడందుకున్న సమయంలో ఒంటిరగా మారిన బీజేపీ నేతలు కూడా మెల్లగా గళం విప్పుతున్నారు. అయితే... వారు తమ పార్టీ కట్టుబాట్లను కాదనలేక విపక్షాలపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఈ విషయంపై స్పందించారు. ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. అప్పట్లో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా దాటవేసినప్పుడు అప్పటికి కేంద్రమంత్రులుగా ఉన్న చిరంజీవి - ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిద్రపోయారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా చట్టంలో దాన్ని చేర్చలేదని.. అప్పుడు వీరంతా ఎందుకు నిలదీయలేదని మాణిక్యాలరావు ప్రశ్నించారు. యూపీఏ ద్వంద్వ వైఖరితో విభజన చేసిందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా పోరు ఒక్కసారిగా స్పీడవడంతో ఏపీ బీజేపీ నేతలు ఎటూ మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. కేంద్రం అది చేస్తోంది ఇది చేస్తోందని నిత్యం చెప్పే బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో నోరు మెదపకుండా సైలెంటయిపోయారు. ఈ తరుణంలో మంత్రి మాణిక్యం స్సందించి విషయాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడం వ్యూహాత్మకమని చెబుతున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్లమెంటులో టీడీపీ - కాంగ్రెస్ - వైసీపీలను ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ కూడా దీనిపై ఆలోచిస్తోంది. ఆ క్రమంలోనే అధిష్టానం ఏపీ బీజేపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని తెలుస్తోంది. మిత్రపక్షం టీడీపీని రెచ్చగొట్టకుండా మిగతా పార్టీలను టార్గెట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ సూచనలతోనే మాణిక్యం చిరంజీవిని సీన్లోకి లాగారని.. తప్పంతా కాంగ్రెస్ దే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.