Begin typing your search above and press return to search.

మిత్ర‌ప‌క్షంలో చీలిక‌ల‌కు ఆ మంత్రి తీరు సాక్షమ‌ట‌

By:  Tupaki Desk   |   2 July 2017 10:11 AM GMT
మిత్ర‌ప‌క్షంలో చీలిక‌ల‌కు ఆ మంత్రి తీరు సాక్షమ‌ట‌
X
మిత్ర‌ప‌క్షాలైన తెలుగుదేశం - బీజేపీల మ‌ధ్య కొన‌సాగుతున్న మైత్రిలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా? ఇన్నాళ్లు నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న ఈ పొరాపొచ్చాలు ఇప్పుడు ర‌చ్చ‌కు ఎక్కాయా? దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు వ్య‌వ‌హార‌శైలే ఇందుకు నిద‌ర్శ‌నమా? -- ఇప్పుడు ఈ చ‌ర్చ నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో హాట్ టాపిక్ అయింది. నవ్యాంధ్రలో టీటీడీ తరువాత రెండో ప్రాధాన్యత కలిగిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి దేవాదాయ - ధర్మాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు గైర్హాజరు అవడం చర్చనీయాంశమవుతోంది.

సుమారు దశాబ్ధకాలం తరువాత కనకదుర్గ ఆలయానికి పాలకమండలి నియామకం జరిగింది. అయితే రాజధాని నడిబొడ్డున కనకదుర్గ ఆలయు పాలకమండలి ప్రమాణ స్వీకారానికి మంత్రితోపాటు పాలక మండలిలో సభ్యునిగా ఉన్న నగర బీజేపీ నేత, చైర్మ‌న్ రేసులో ఉన్న‌ రంగ ప్రసాద్‌ కూడా హాజరుకాకపోవడం చూస్తుంటే టీడీపీ-బీజేపీల మధ్య అగాధం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ సభ్యులు రంగప్రసాద్‌ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. చైర్మన్‌ పదవి తొలుత ఇస్తానంటే రంగప్రసాద్‌ ఒప్పుకున్నారని, కానీ ఆ తరువాత మొదటి సంవత్సరం టీడీపీ, రెండో సంవత్సరం బీజేపీకి అని అనడంతో ఆయన నొచ్చుకున్నారని తెలిసింది. ఈ కారణంగానే ఆయన గైర్హాజరైనట్లు చెబుతున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం జమ్మిదొడ్డిలో కనకదుర్గ ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి కార్యాలయంపైనే ఉన్నా ఆలయంలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు సైతం బీజేపీకి చెందిన దేవాదాయ, ధర్మాదాయ మంత్రి దూరంగా ఉంటున్నారా లేక మిత్రపక్షమైన టీడీపీనే దూరంగా పెట్టిందా అనే అంశంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కొత్త చ‌ర్చ విజ‌య‌వాడ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మొద‌లైంది.

విజయవాడ కేంద్రంగా బీజేపీ ఎదిగితే భవిష్యత్తులో టీడీపీకి కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో విజయవాడ నగరంలో ఓ ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో సెంట్రల్‌ సీటు బీజేపీకి కేటాయించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అధికారపార్టీ మిత్రపక్షమైన బీజేపీని వ్యూహాత్మ‌కంగా దూరంగా ఉంచుతోందనే వాదన కూడా వినబడుతోంది. ఈ నేపథ్యంలో దుర్గగుడిపై కమలనాధులకు చోటుకల్పిస్తే ఆ పార్టీకి బలం చేకూర్చినట్లే భావనతో టీడీపీ ఉన్నట్లు సమాచారం. బీజేపీతో కేంద్ర స్థాయిలో మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా సహకరించకూడదని అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఈనెల మూడో తేదీన పాలకమండలి చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ఆలయ పాలక సభ్యుడు రంగ ప్రసాద్‌ ప్రమాణ స్వీకారానికి రాని నేపథ్యంలో చైర్మన్‌ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా దుర్గ‌గుడి పాల‌క‌మండ‌లి కేంద్రంగా టీడీపీ-బీజేపీల మ‌ధ్య ఉన్న లుక‌లుక‌లు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాయ‌ని అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/