Begin typing your search above and press return to search.

పీవీపీ ట్వీట్ వైరల్.. ఏపీకి మహిళా ముఖ్యమంత్రి ఎవరో!

By:  Tupaki Desk   |   20 Feb 2020 6:30 AM GMT
పీవీపీ ట్వీట్ వైరల్.. ఏపీకి మహిళా ముఖ్యమంత్రి ఎవరో!
X
ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ రాజకీయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆయన రాజకీయాల్లో ఉత్సాహంగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను వివరిస్తూ టీడీపీ నాయకుల తీరును సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ట్వీట్ చేశారు.. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది. సమకాలీన రాజకీయాలపై చేసిన వ్యాఖ్య త్వరలో ఏపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం తన ట్విటర్ లో ఒక పోస్ట్ చేశారు.

ఆ ట్వీట్ వైఎస్సార్సీపీలో ప్రకంపనలు రేపెట్టు ఉంది. అయితే ఈ విధంగా ఉందని తెలియడంతో కొద్దిసేపటికి ఆయన ట్వీట్ డిలీట్ చేయగా.. ఆలోపు చాలామంది చూసి స్క్రీన్ షాట్, సేవ్ చేసుకోవడంతో ఇప్పుడు వైరలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ని చూడాలని అభిలషించారు.

‘‘బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనను పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్ట్. ఆనాడు, అన్న NTR గారు, ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వంలో సగం’’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

దీంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన కోరినట్టు రాష్ట్రంలో జరుగుతాయేమోనని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. దీనికి తప్పనసరిగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతుంటే తప్పనిసరిగా రావాలంటూ న్యాయస్థానం స్పష్టం చేస్తోంది. ఈ కేసులో ఏ క్షణమైనా విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటం, ఈ కేసులో జగన్ అరెస్ట్ కావడం ఖాయమంటూ పుకార్లు వస్తున్నాయి. దానికి అనుగుణంగా టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ జైలుకెళితే ముఖ్యమంత్రి గా ఆయన భార్య భారతి రెడ్డి, లేదా సోదరి షర్మిల పదవీ బాధ్యతలు చేపడతారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమయంలోనే పీవీపీ అలాంటి ట్వీట్ చేయడంతో వాటికి బలం చేకూరుతుంది. మహిళా సీఎంను చూడాలని ఉందంటూ అకస్మాత్తుగా పీవీపీ ట్వీట్ చేయడం వెనక ఏవో కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. విచారణలో భాగంగా జగన్ జైలుకెళ్లడం ఖాయమనే వార్తలు ఆయనకు తెలియడంతో ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు.

రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఊహించి ఆ విధంగా చేశారా? అనే ప్రశ్న మొదలవుతోంది. అరెస్టయ్యే సూచనలు ఉండడంతోనే జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేసుల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించినట్లు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే పీవీపీ ట్వీట్ అని పేర్కొంటున్నారు. మరి పీవీపీ చేసిన ఈ ట్వీట్ అధికార పార్టీకి తలనొప్పిగా మారనుండగా.. తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రం కానుంది.