Begin typing your search above and press return to search.

భలే పోరు.. స్వర్ణం కోసం సింధు వెర్సస్ సైనా

By:  Tupaki Desk   |   14 April 2018 8:14 AM GMT
భలే పోరు.. స్వర్ణం కోసం సింధు వెర్సస్ సైనా
X
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పూసర్ల వెంకట సింధు - సైనా నెహ్వాల్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వీళ్లిద్దరూ కామన్వెల్త్ క్రీడల్లో ఒకరితో ఒకరు తలపడబోతున్నారు. మహిళల సింగిల్స్‌ లో మిగతా క్రీడాకారిణులందరినీ వెనక్కి నెట్టి వీళ్లిద్దరే ఫైనల్ చేరారు. శనివారం వీళ్లిద్దరూ సెమీఫైనల్స్‌లో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఓ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-14.. 18-21.. 21-17తో స్కాట్లాండ్ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్‌ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మూడు గేమ్‌ లూ హోరాహోరీగా సాగాయి. మరో సెమీఫైనల్లో సింధులు సులువుగా గెలిచింది. ఆమె 21-18.. 21-8తో కెనడా క్రీడాకారిణి మైఖేల్ లీపై గెలిచింది. ర్యాంకు.. ఆటతీరు ప్రకారం చూస్తే ఫైనల్లో సింధునే ఫేవరెట్ అని చెప్పాలి. ఐతే సింధుతో చివరగా తలపడ్డ రెండు సార్లూ సైనాదే పైచేయి అయింది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగానే సాగుతుందని చెప్పవచ్చు. ఫైనల్ ఆదివారం జరగబోతోంది.

వీళ్లిద్దరూ ఫైనల్‌ కు చేరుకున్న నేపథ్యంలో మహిళల సింగిల్స్‌ లో భారత్‌ కు స్వర్ణం - రజతం రెండూ ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల సింగిల్స్‌ లో కిదాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్ చేరాడు. కొన్ని రోజుల కిందటే ప్రపంచ నంబర్ వన్ అయిన అతను సెమీఫైనల్లో 21-10, 21-17తో ఇంగ్లాండ్ ఆటగాడు రాజీవ్ ఔసెఫ్ ను ఓడించాడు. మరో భారత ఆటగాడు ప్రణయ్ సెమీస్‌లో ఓడాడు. అతను 16-21, 21-9, 14-21తో మలేషియా టాప్ స్టార్ లీ చాంగ్ వీ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫైనల్లో శ్రీకాంత్.. లీ చాంగ్ వీ తలపడనున్నారు. భారత్ ఇప్పటికే మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.