Begin typing your search above and press return to search.

నా లక్ష్యం గోల్డ్ .. దుర్గమ్మ దయతో సాధిస్తా : పీవీ సింధు !

By:  Tupaki Desk   |   6 Aug 2021 6:56 AM GMT
నా లక్ష్యం గోల్డ్ .. దుర్గమ్మ దయతో సాధిస్తా : పీవీ సింధు !
X
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకుని చరిత్ర సృష్టించి స్వదేశానికి వచ్చిన పీవీ సింధుకి దేశంలో అడగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సింధు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంది. ఆలయాధికారులు సింధుకి ఘన స్వగతం పలికారు. సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన నేప‌థ్యంలో ఆమె విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి ద‌ర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ అనంతరం పండితులు పీవీ సింధుకు వేదాశీర్వచనం అందించారు.

ఆ త‌ర్వాత పీవీ సింధుకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌ కు వెళ్లేముందు తాను క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నానని, అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో నెగ్గి పతకం సాధించాన‌ని చెప్పింది. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తాను ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ ఆడ‌తాన‌ని తెలిపింది. 2024 ఒలింపిక్స్‌ లో పాల్గొంటానని ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు

దుర్గమ్మ దర్శనం తర్వాత సింధు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ని కలిశారు. ఒలింపిక్స్‌ లో కాంస్యం సాధించిన సింధు ను సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని.. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం సీఎం కొనియాడారు. క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులందరికీ ప్రభుత్వం తరుపున తగిన ప్రోత్సహం అందిస్తామన్నారు.

గతంలో రియో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు వెండి పతకం సాధించిన సందర్భంలో ఆమెకు భారీగా నగదు ప్రోత్సహకం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు నగదుతో పాటు హైదరాబాద్‌ లో కోట్ల రూపాయల విలువచేసే 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. అటు ఏపీ ప్రభుత్వం రూ.3కోట్లు నగదుతో పాటు అమరావతిలో 1000 గజాల స్థలం,గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, పలు సంస్థలు అన్నీ కలిపి దాదాపు రూ.12.3కోట్ల నగదు బహుమతిని పీవీ సింధును అందుకుంది.