Begin typing your search above and press return to search.

మన సింధు చరిత్ర సృష్టించింది

By:  Tupaki Desk   |   18 Aug 2016 4:50 PM GMT
మన సింధు చరిత్ర సృష్టించింది
X
మన తెలుగమ్మాయి సింధు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ మరే భారత స్టార్ షట్లర్ సాధించని ఒక రికార్డును నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ పై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లటమే కాదు.. రజతాన్ని ఖరారు చేసుకుంది. రియో ఒలింపిక్స్ మొదలై ఇన్ని రోజులు అవుతున్నా ఒక్క పతకం అంటే ఒక్క పతకం దేశానికి రాని వేళ.. గురువారం తెల్లవారుజామున రెజ్లర్ సాక్షి మాలిక్ కంచుతో ఖాతా తెరిస్తే.. అదే గురువారం రాత్రి మన సింధు రజతాన్ని పక్కా చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే స్వర్ణం సిందు సొంతం కావటం సాధ్యమే.

షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 7.30 గంటలకు సెమీస్ మ్యాచ్ షురూ కావాల్సి ఉంది. అయితే.. అంతకుముందు జరిగిన మ్యాచ్ ఆలస్యం కావటంతో సింధు మ్యాచ్ కాస్త లేటుగా స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు.. జపాన్ షట్లర్ ఒకుహార నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. వారిద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే.. మాంచి దూకుడు మీదున్న సింధు స్మాష్ లతో విరుచుకుపడి తొలి గేమ్ ను అరగంటలోనే తన సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభం నుంచి సింధు జోరును ఒకుహార నిలువరించలేకపోయింది. చివరకు సింధు చరిత్ర సృష్టిస్తూ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. మాంచి జోరు మీదున్న సింధు స్వర్ణం సాధిస్తుందని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ సింధు.