Begin typing your search above and press return to search.

మనల్ని చూసి గూగుల్ సిగ్గుపడుతోంది

By:  Tupaki Desk   |   20 Aug 2016 11:30 AM GMT
మనల్ని చూసి గూగుల్ సిగ్గుపడుతోంది
X
టెన్నిస్ లో 34 గ్లాండ్ స్లామ్ టోర్నీలు గెలిచిన లియాండర్ పేస్ ది ఏ కులం..?

ఒలింపిక్సులో భారత్ కు హాకీలో స్వర్ణాలు సాధించిపెట్టిన ధ్యాన్ చంద్ ది ఏ కులం..

షూటింగులో స్వర్ణం అందించిన అభివన్ బింద్రాది ఏ కులం..?

ఇంతకుముందు ఇండియాకు కాంస్యం తీసుకొచ్చిన తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరిది ఏ కులం?

అంతెందుకు... దేశమంతా మెచ్చే ధోనీది ఏ కులం..? విరాట్ కోహ్లీది ఏ కులం?

ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? భారతీయులంతా వారిని మనోళ్లనే అనుకుంటారు. మహా అయితే, ఆయా రాష్ర్టాల వారు మరింతగా ఓన్ చేసుకుంటారు. అంతేకానీ.. మా కులం వాడు.. మా మతం వాడు అని ఎవరూ అనుకోరు. కానీ.. విచిత్రంగా తెలుగువారు మాత్రం ఒలింపిక్సులో రజత పతకం సాధించి రికార్డు సృష్టించిన సింధుది ఏ కులమో తెలుసుకోవాలని తెగ ట్రై చేశారు. ఏ డౌట్ వచ్చినా ముందుగా ఆశ్రయించే గూగుల్ లో ఒక రేంజ్ లో సెర్చి చేశారు. ఎంతగా అంటే.. సింధు రికార్డులు.. ఆమె ఘనత తెలుసుకోవడం కంటే ఆమె కులం తెలుసుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారట. ఇంకో విషయం ఏంటంటే... కేవలం తెలుగు రాష్ర్టాల నుంచే కాదు - అమెరికా నుంచీ ఆమె కులం కోసం చాలామంది సెర్చి చేశారట. అక్కడా మనోళ్లే కదా.. ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ కులాన్ని అనుకుంటూ సింధుది మన కేస్టేనా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

గూగుల్ ట్రెండ్ స్టాటిస్టిక్సు చూస్తే… గత వారం రోజులుగా సింధు కులం కోసం గూగుల్‌ లో నెటిజన్ లు భారీగా వెతికారట. సెమి ఫైనల్‌ మ్యాచ్ గెలిచినప్పటి నుంచి ఈ పిచ్చి పీక్‌ స్టేజికి చేరింది. జూన్‌ లో లక్షా 50వేల మంది సింధు కులం తెలుసుకునేందుకు గూగుల్‌ లో అన్వేషించారు. జులైలో ఆ సంఖ్య 90 వేలుగా ఉంది. ఇక రియోలో సింధు మెరుపులు మొదలయ్యాక ఆగస్టులో దాదాపు పది రెట్లు అధికంగా సింధు కులం కోసం వెతికారు. ఆమెది తెలంగాణా లేదంటే ఏపీయా అన్నది కూడా చాలామంది గూగుల్ లో వెతికారు.

కాగా ఇలా వెతికిన వారిలో తెలుగు రాష్ట్రాల జనమే ఎక్కువగా ఉన్నారు. దేశానికి గర్వకారణమైన క్రీడాకారుల విషయంలో మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి తీరు కనిపించదు. వారిని భారతీయులుగానే చూస్తున్నారు తప్ప కులం - మతం పేరుతో వేరుగా చూడడం లేదు. అంతెందుకు... సింధు విజయంతో దేశమంతా సంతోషించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆమెకు 50 లక్షల బహుమతి ప్రకటించింది. సింధుది మధ్య ప్రదేశ్ కాదు... ఆమెది - మధ్యప్రదేశ్ సీఎంది ఒకటే కులం కూడా కాదు. అయినా.. ఆ రాష్ట్రం స్పందించిందంటే అందుకు కారణం సింధు దేశానికి తీసుకొచ్చిన గౌరవం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తెలుగు ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత ధోరణులు మానుకుంటే బెటర్.