Begin typing your search above and press return to search.

భాగ్యనగరికి వచ్చేసిన ‘‘సిల్వర్’’ సిందు

By:  Tupaki Desk   |   22 Aug 2016 5:15 AM GMT
భాగ్యనగరికి వచ్చేసిన ‘‘సిల్వర్’’ సిందు
X
కాలం ఎంత చిత్రమైంది. మొన్నటికి మొన్న బోనం ఎత్తి హైదరాబాద్ వీధుల్లో తిరిగిన ఆ అమ్మాయి కోసం ఈ రోజు రాష్ట్ర మంత్రులు వెయిట్ చేసే పరిస్థితి. ఆమెకు స్వాగతం పలకటం కోసం పెద్దఎత్తున అధికారులు ముందస్తుగా కసరత్తు చేయటమే కాదు.. ఆమెను గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇంతేనా.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే అభినందనలతో ముంచెత్తటానికి.. పూల బొకేలు ఇచ్చేందుకు ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇంతకూఅంత భారీగా స్వాగతం ఎవరి కోసం అంటారా? ఇంకెవరు మన సిల్వర్ సింధు కోసమే.

కొద్దిరోజుల క్రితం కొద్దిమంది సన్నిహితులు సమక్షంలో ఇదే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రియోకు వీడ్కోలు పలికిన నాటికి.. నేటికీ ఎంత తేడా? నాడు ఆల్ ద బెస్ట్ చెప్పిన గుప్పెడు మంది స్థానే.. ఈరోజు గ్రాండ్ గా వెలకమ్ చెప్పేందుకు వందలాది మంది ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అభిమానులతో పాటు అధికారులు.. పెద్ద ఎత్తున పోలీసులే కాదు.. మీడియా హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్ లో రజత పతకాన్ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించిన సింధు.. తాజాగా హైదరాబాద్ వచ్చేసింది. నిన్న బయలుదేరిన ఆమె షెడ్యూల్ ప్రకారం ఆమె ప్రయాణిస్తున్న విమానం సోమవారం ఉదయం 9 గంటల వేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నేతలు.. అధికారులు రెఢీ అయ్యారు. బంధువులు..మిత్రులు.. సన్నిహితులు.. అభిమానుల హడావుడి చెప్పాల్సిన అవసరమే లేదు.

తనను అభినందించటానికి వచ్చిన వారిని నవ్వుతూ పలుకరిస్తూ ఉత్సాహంగా ఉన్న సింధు వెంట ఆమె గురువు గోపీచంద్ ఉన్నారు. ఎయిర్ పోర్ట్ బయలకు వచ్చిన ఆమెను అందంగా అలంకరించిన వాహనంలో ఎక్కించారు. మువ్వెన్నల జెండాను చేత పట్టుకొని సగర్వంగా వాహనం మీదకు చేరుకున్న సిందు.. సంతోషంతో చేతులు ఊపుతూ..తనను చూసేందుకు..అభినందించేందుకు వచ్చిన ప్రతిఒక్కరిని పలుకరించింది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు గచ్చిబౌలి స్టేడియం వరకూ సాగుతోంది. ఆమెను చూసేందుకు.. వెల్ కం చెప్పేందుకు రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది వెయిట్ చేశారు. మరోవైపు గచ్చిబౌలి స్టేడియంలో సింధును అభినందనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. . ఈ మొత్తం దృశ్యాలు ఎంతోమంది క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయనటంలో సందేహం లేదు.