Begin typing your search above and press return to search.

తెలంగాణ అధికారులకు చుక్కలు చూపించిన ఆంధ్రా ఐఏఎస్

By:  Tupaki Desk   |   4 May 2016 6:24 AM GMT
తెలంగాణ అధికారులకు చుక్కలు చూపించిన ఆంధ్రా ఐఏఎస్
X
కాస్త విషయం ఉంటే కథ ఎలా ఉంటుందనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణ. లిటిగెంట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ అధికారులే మిన్నగా కనిపిస్తారన్న మాట ఒకటి ప్రచారంలో ఉంది. ఏదైనా విషయం మీద తమ వాదనను సమర్థంగా వినిపించే విషయంలో ఏపీ నేతలు.. అధికారులు నీళ్లు నములుతుంటారని.. దీనికి భిన్నంగా తెలంగాణ నేతలు.. అధికారులు వ్యవహరిస్తారన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. అయితే.. దీనికి భిన్నంగా చోటు చేసుకున్న తాజా ఉదంతమిది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే పంచాయితీలు ఉన్నాయి. అయితే.. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు.. ఒక ఏపీ ఐఏఎస్ అదికారికి మధ్య నడుస్తున్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన క్వార్టర్ లో ఉన్నారంటూ తెలంగాణ అధికారులు చేస్తున్న వాదనను తప్పని తేల్చటమే కాదు.. తాను రిటైర్ అయ్యే వరకూ క్వార్టర్ ఖాళీ చేయనని చెప్పటమే కాదు.. రూల్స్ లెక్కతో చుక్కలు చూపించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ హైదరాబాద్ లోని ఒక క్వార్టర్ లో ఉంటున్నారు. పీవీ రమేష్ ఏపీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన నివాసం ఉంటున్న క్వార్టర్ తమదేనని తెలంగాణ అధికారులు వాదిస్తూ.. ఆయనకు నోటీసులు ఇస్తూ ఖాళీ చేయాలంటున్నారు. దీనికి ససేమిరా అంటున్నారు పీవీ రమేష్. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆయన నివాసం ఉంటున్న క్వార్టర్ వద్దకు వెళ్లి.. వెంటనే ఖాళీ చేయాలని.. లేదంటే కరెంటు.. నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. దీనికి తీవ్రంగా స్పందించిన ఆయన.. రూల్స్ చెప్పుకొచ్చి తెలంగాణ అధికారుల నోట మాట రాకుండా చేశారు.

ఇక.. పీవీ రమేష్ క్వార్టర్ వివాదాన్ని చూస్తే.. ఉమ్మడి రాష్ట్ర కేడర్ లో పని చేసిన ఆయన విభజన నేపథ్యంలో ఏపీ కేడర్ లో చేరిపోయారు. 2014 ఫిబ్రవరి 15న రాష్ట్ర విభజన నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే.. ఫిబ్రవరి 14న అప్పటివరకూ తాను ఉంటున్న క్వార్టర్ ను ఖాళీ చేసిన పీవీ రమేష్.. ప్రస్తుతం ఉంటున్న కొత్త క్వార్టర్ లోకి మారిపోయారు.

విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం.. రాష్ట్ర విభజనకు ముందు ఐఏఎస్ అధికారులు తాము ఉంటున్న ప్రభుత్వ భవనాల్లో రిటైర్ అయ్యే వరకూ ఉండే వెసులుబాటు ఉంది. దీనికి తగ్గట్లే రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు కూడా. నిబంధనల ప్రకారం చూస్తే.. పీవీ రమేష్ తాను ఉంటున్న క్వార్టర్ లో ఆయన రిటైర్ అయ్యే వరకూ ఉండే అవకాశం ఉందన్నది ఆయన వాదన. ఇదిలా ఉంటే.. ఆ క్వార్టర్ ను ఖాళీ చేయించాలన్నది తెలంగాణ ప్రభుత్వం వాదన. గడిచిన ఆరు నెలలుగా ఆయన్ను క్వార్టర్ నుంచి ఖాళీ చేయించాలని తెలంగాణ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ రమేష్ అందుకు నో అనటంతో తాజాగా ఆయన ఇంటికి తెలంగాణ ఎస్టేట్ అధికారులు వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలన్నారు.

తన క్వార్టర్ వద్దకు వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని తెలంగాణ అధికారులు కోరటాన్ని రమేష్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. విభజన నిబంధనలు చెప్పటంతో పాటు.. పదో షెడ్యూల్ సంస్థల కిందకు వచ్చే ఎంసీహెచ్ ఆర్డీకి చెందిన క్వార్టర్ లో తాను నివాసం ఉంటున్నానని.. అది తెలంగాణ ప్రభుత్వం కిందకు రాదని స్పష్టం చేయటంతో పాటు.. పదో షెడ్యూల్ లో ఉన్న సదరు సంస్థ విభజన ఇంకా పూర్తి కాని నేపథ్యంలో.. తాను ఉన్న క్వార్టర్ తెలంగాణ ప్రభుత్వానికి ఎలా చెందుతుందో చెప్పాలో ప్రశ్నించేసరికి తెలంగాణ ఎస్టేట్ అధికారుల నోట మాట రాని పరిస్థితి. తాను క్వార్టర్ ఖాళీ చేసే ప్రసక్తి లేదని రమేష్ తేల్చి చెప్పటం.. దానికి తగ్గట్లు రూల్స్ చూపించటంతో చేసేదేమీ లేక తెలంగాణ అధికారులు వెనుతిరగక తప్పలేదు. నిబంధనల మీద పట్టు ఉంటే అందుకు భిన్నంగా ఎవరూ ఏమీ చేయలేరు కదా..?