Begin typing your search above and press return to search.

పీవీ నరసింహారావు : అపర చాణక్యుడు ఆ డైరీలో ఏం రాశారో ?

By:  Tupaki Desk   |   28 Jun 2021 7:34 AM GMT
పీవీ నరసింహారావు :  అపర చాణక్యుడు ఆ డైరీలో ఏం రాశారో ?
X
లక్నేపల్లి అనే ఒక గ్రామంలో పుట్టి, పెరిగి రాజకీయ పరమపదసోపానంలో ఒక్కో మెట్టును ఎక్కుతూ ఎన్నో సవాళ్లని ఎదుర్కొని భారత ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. 1921 జూన్‌ 28లో జన్మించిన పీవీ 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. నేడు అయన శతజయంతి. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంది. చదువు పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఆ తర్వాత 1957లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా 1962, 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం 1972లో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంతో 1977 వరకు పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి రెండు సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచారు. 1984లో హన్మకొండ, మహారాష్టలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా పోటీ చేయగా హన్మకొండలో ఓటమి చవిచూసినా, రాంటెక్‌లో విజయం సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. గాడితప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో మన దేశ ఖ్యాతిని నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ. 1991లో రాజీవ్‌ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న పీవీని ప్రధాని పదవి వెతుక్కుంటూ వచ్చింది. దేశంలో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రధానిగా పీవీ పేరునే పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవ మద్దతుఉండటంతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి, 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు.

హైద‌రాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో 26 అడుగుల పీవీ నరసింహారావు కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా హైద‌రాబాద్‌లోని ఆ విగ్రహావిష్కరణ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. పీవీ విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అలాగే, పీవీ మార్గ్‌ ను ప్రారంభించారు. పీవీ మార్గ్‌ లోని జ్ఞాన‌భూమిలో శ‌త‌జ‌యంతి ముగింపు ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.ఆ తర్వాత పీవీకి సంబంధించిన తొమ్మిది పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 ఉండ‌గా, మిగతావి ఆయన జీవితాన్ని విశ్లేషించే ప‌లువురు రాసినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ పుస్తకాలను ముద్రించాయి. ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత గ్రామం వంగరతో పీవీకి ఎనలేని అనుబంధం ఉంది.