Begin typing your search above and press return to search.

సీఎం అయ్యేందుకు కేటీఆర్ రెఢీగా ఉన్నారు.. చెప్పేసిన మంత్రి

By:  Tupaki Desk   |   17 Jun 2023 3:57 PM IST
సీఎం అయ్యేందుకు కేటీఆర్ రెఢీగా ఉన్నారు..  చెప్పేసిన మంత్రి
X
అసలు ఎన్నికల సమయం. ఇలాంటి వేళ... రాజకీయ నేతల మాటలు ఎలా ఉంటాయన్న దానికి నిలువెత్తు రూపంగా బీఆర్ఎస్ నేతల మాటలు ఉంటున్నాయి. అధికార పార్టీగా తమకున్న అడ్వాంటేజ్ ను మరింతగా ఉపయోగించుకుంటూ.. గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. పనిలో పనిగా అధినేత కేసీఆర్ ను.. చిన్న బాస్ కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రదర్శిస్తున్న విధేయత ఇప్పుడు మరో లెవల్ అన్నట్లుగా మారింది. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

తాజాగా జరిగిన ఒక సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముందే మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల్ని టార్గెట్ చేస్తూ.. మరోవైపు అధినాయకత్వం మనసు దోచేలా మాట్లాడటం గమనార్హం.

విపక్ష నేతలు చాలానే మాటలు మాట్లాడుతున్నారన్న మంత్రి పువ్వాడ.. ''ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న మాటను అడిగితే మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ.. బీఆర్ఎస్ లో మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్.. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ లో మాత్రం సిద్ధంగా ఉన్నారన్నారు.

మంత్రి కేటీఆర్ ఆలోచనా విధంగా.. ఆయన పని తీరు రాష్ట్రానికి ఎంతో అవసరమంటూ ఆకాశానికి ఎత్తేశారు. గొంగలిపురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోకచిలుకలా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్ కు దక్కుతుందన్నారు.

హైదరాబాద్ లో ఏం జరిగినా.. ఖమ్మంలో ఎందుకు జరగదని అడుగుతూ.. వెంటపడి మరీ తనను పరుగులు తీయించి మరీ పనులు చేయించారన్నారు. ఖమ్మంలో సాగిన డెవలప్ మెంట్ మొత్తం మంత్రి కేటీఆర్ ఖాతాలో వేసిన మంత్రి పువ్వాడ.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తెలంగాణ కేబినెట్ మొత్తంలో తనను మాత్రమే మంత్రి కేటీఆర్ 'ఒరేయ్'' అని పిలుస్తారన్నారు. అయితే.. అందరిలో అనరని.. నాలుగు గోడల మధ్యలో మాత్రం అలా పిలుస్తారన్న ఆయన.. ఖమ్మంలో జరిగిన డెవలప్ మెంట్ కు మంత్రి కేటీఆరే కారణమని స్పష్టం చేశారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ మనసు దోచుకునేలా మాట్లాడి మంత్రి పువ్వాడ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.