Begin typing your search above and press return to search.

భారత్‌ పర్యటనకు పుతిన్‌.. ప్రధాని తో కీలక భేటీ!

By:  Tupaki Desk   |   11 Nov 2021 8:39 AM GMT
భారత్‌ పర్యటనకు పుతిన్‌.. ప్రధాని తో కీలక భేటీ!
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్ నెలలో భారత్‌ పర్యటనకి రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్‌ మొదటి వారం లో పుతిన్‌ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 6న ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత రష్యా అధ్యక్షుడికి ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం.

ఇంతకుముందు ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెనీవాలో సమావేశమయ్యారు. అనంతరం ఇటలీలో జరిగిన జీ 20 సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. కాగా, పుతిన్‌ చివరిసారిగా 2018లో భారత్‌ లో పర్యటించారు. అప్పుడు 400 డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను భారత్‌, రష్యా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది చివరికి ఎయిర్‌ ఢిఫెన్స్‌ సిస్టమ్స్‌ కు చెందిన పరికరాల్లో మొదటి బ్యాచ్‌ భారత్‌ కు చేరనున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు మరోమారు సమావేశమవుతుండటం విశేషం. గతేడాది జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు కరోనా నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 వార్షిక శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్400 డిఫెన్స్ సిస్టమ్స్ మన దేశానికి ఈ ఏడాది చివరికల్లా అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. 2018లో ఇరు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ వచ్చారు. ఆ సమావేశంలోనే ఇరు దేశాల మధ్య ఎస్400 రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పుతిన్ భారత్ కు రానుండటం ఇదే తొలిసారి.