Begin typing your search above and press return to search.

'యూదు' వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ ప్రధానికి పుతిన్ సారీ.. నిజమెంత?

By:  Tupaki Desk   |   6 May 2022 10:29 AM GMT
యూదు వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ ప్రధానికి పుతిన్ సారీ.. నిజమెంత?
X
ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముదురుతోంది. ఓవైపు దాడులు కొనసాతుండగా.. వాటికి దీటుగా మాటలు పేలుతున్నాయి. ఈ మాటలు "జాతుల "ప్రస్తావన వరకు వెళ్లాయి. గతవారం ఓ ఇటలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. జర్మనీ మాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి అందరికీ తెలిసిందే. హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యూదులను ఊచకోత కోశారు. ఆయనకు చెందిన నాజీ సైన్యం.. యూదులను కాన్సట్రేషన్ క్యాంపుల్లో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారు.

నాటి భయంకర ఘటనలతో యూదులు చెల్లాచెదురై పోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అనుభవంతో తమకంటూ ఓ దేశం ఉండాలంటూ పూర్వ గడ్డ ను వెదుక్కుంటూ "ఇజ్రాయిల్"ను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా 1948లో జరిగింది. స్వతహాగానే యూదులు అత్యంత తెలివైనవారు. దీంతో అనతికాలంలోనే అమెరికా సహా ప్రపంచాన్నే శాసించగల స్థాయికి చేరారు.

పుతిన్ సన్నిహితులూ యూదులే..

అంతెందుకు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుల్లోనూ యూదులున్నారు. వారిలో ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ చెల్సియా యజమాని రోమన్ అబ్రమోవిచ్ ఒకరు. ఇలాంటివారిని రష్యన్ ఒల్గారిచ్ (సంపన్నులు) అంటారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆ యూదు ఒల్గారిచ్ లకు వ్యాపార కష్టాలు వచ్చాయి. వీరు ఎవరి పక్షమో తేల్చుకోలేని పరిస్థితుల్లో.. ఇజ్రాయిల్ కు సంకట స్థితి ఎదురైంది. పైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూదుడు కావడంతో మరింత ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమైంది.

హిట్లర్ లోనూ యూదు మూలాలున్నాయంటూ..

యూదుల పాలిట హిట్లర్ దమనకాండ గురించి చెప్పుకొన్నాం కదా.. అందుకే ఇప్పటికీ హిట్లర్ ను యూదులు వర్గ శత్రువుగా చూస్తారు. ఆ పేరంటేనే మండిపడతారు. హిట్లర్‌లో యూదు మూలాలు ఉన్నాయంటూ అందుకే ఇటీవల సెర్గీ లవ్రోవ్ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్ కు మంట పుట్టించాయి. ఇవి క్షమించరాని వ్యాఖ్యలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

ఈ అభ్యంతరక వ్యాఖ్యలపై స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పారని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. 'లవ్రోవ్ వ్యాఖ్యలపై పుతిన్‌ చెప్పిన క్షమాపణలను ప్రధాని అంగీకరించారు. యూదు ప్రజల పట్ల, హోలోకాస్ట్ స్మారకం పట్ల తన వైఖరిని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు' అంటూ ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఇజ్రాయెల్ 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ క్షమాపణల అంశాన్ని ప్రస్తావించలేదు. బెన్నెట్, పుతిన్ మధ్య సంభాషణ జరిగిందని, హోలోకాస్ట్ స్మారకం గురించి వారు చర్చించుకొన్నారని పేర్కొంది.

ఉక్రెయిన్ పై యుద్ధ నినాదమే "నియోనాజీ" యుద్ధం ప్రారంభం నుంచి రష్యా చెబుతున్నది.. ఉక్రెయిన్ లోని నియో నాజీలను తరిమి కొడతామని. ఇలాంటి సమయంలో.. టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో లవ్రోవ్ మాట్లాడుతూ.. "మేం యూదులం అయినపుడు నాజీ లక్షణాలున్న శక్తులెలా తమ దేశంలో ఉంటాయని ఉక్రెయిన్ వారు అంటున్నారు. కానీ, నా అభిప్రాయం ప్రకారం.. హిట్లర్‌లోనూ యూదు మూలాలు ఉన్నాయి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది.