Begin typing your search above and press return to search.

రెండో భార్య గురించి దేశాధ్యక్షుడ్నే అడిగిన సామాన్యుడు

By:  Tupaki Desk   |   15 April 2016 7:44 AM GMT
రెండో భార్య గురించి దేశాధ్యక్షుడ్నే అడిగిన సామాన్యుడు
X
ఊహించని అనుభవం ఒకటి ఆ దేశాధ్యక్షుడికి ఎదురైంది. తిరుగులేని అధిపత్యం ప్రదర్శించే సదరు దేశాధ్యక్షుడ్ని ఒక సామాన్యుడు అడిగిన ప్రశ్న.. అంత పెద్ద నేతను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. కొద్ది క్షణాలు నోట మాట రాకుండా చేయటమే కాదు.. ఆ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా వార్తగా మారింది. దేశాధ్యక్షుడి వ్యక్తిగత విషయాన్ని సూటిగా అడిగేసిన సదరు సామాన్యుడి మీద ఆయనెలా రియాక్ట్ అయ్యారు? అన్నది ఒక సందేహం అయితే.. మరి ఎలాంటి సమాధానం చెప్పారన్నది ఆసక్తికరం. ఇంతకీ ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదురైన దేశాధ్యక్షుడు ఎవరో కాదు రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఆయన వైవాహిక జీవితం మీద బోలెడన్ని వార్తలు రావటం తెలిసిందే. 2013లో తన మొదటి భార్య లుద్మిలా నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన రెండో భార్య గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలుత ఒంటరిగానే ఉన్న పుతిన్.. ఆ తర్వాతి కాలంలో ఒకప్పటి ఒలంపిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో సన్నిహితంగా ఉండటం.. ఆమెతో కలిసి డేటింగ్ చేయటం లాంటి వార్తలు చాలానే గుప్పుమన్నాయి. వీటికి సంబంధించిన కథనాల్ని రష్యా మీడియాలో చాలానే వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టీవీ షోలో పుతిన్ పాల్గొన్నారు. పుతిన్ ను దేశ ప్రజలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు పుతిన్ తో మాట్లాడుతూ.. మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా? అని సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి ప్రశ్నను ఊహించని పుతిన్ కొద్ది క్షణాలు తడబడినా వెంటనే సర్దుకున్నారు. రష్యా అధ్యక్షుడిగా ఎలా పని చేస్తున్నానన్న విషయం కంటే కూడా.. తన వ్యక్తిగత జీవితం గురించే ఆసక్తి వ్యక్తమవుతుందన్న ఆయన.. ఏదో ఒక రోజు మీ ప్రశ్నకు సమాధానం చెబుతానంటూ ముక్తాయించాడు. చిరాకు పుట్టించే ప్రశ్నకు పుతిన్ చాలా సింఫుల్ గా సమాధానం చెప్పేశారు కదూ.