2024 ఎన్నికలకు మోడీని తప్పిస్తున్నారా?

Tue May 04 2021 16:00:02 GMT+0530 (IST)

pushing Modi for the 2024 elections?

దేశ ప్రధాని మాటల మాంత్రికుడు.. నరేంద్ర మోడీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2014లో అనూహ్యంగా ప్రధాని పదవికి ప్రమోషన్ తెప్పించుకున్న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అనేక రూపాల్లో సంచలనాలకు ఆ ఎన్నికల్లో వేదికగా మారారు.ఈ క్రమంలోనే ఆయన అనూహ్య విజయాన్ని సంపాయించుకున్నారు. `చాయ్ పే`- అంటూ.. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను తీవ్రస్థాయిలో చర్చకు పెట్టారు. అంతేకాదు.. పాతతరం రాజకీయాలు వద్దు.. ప్రజల కోసం ఉండే ప్రభుత్వాన్ని నిర్మిద్దామని.. ప్రజలకోసం ఉండే నేతలను ఎన్నుకుందామని.. కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు.దీంతో మోడీ వ్యూహానికి దేశం యావత్తు.. ముందుకు వచ్చింది. ఆయనకు జేజేలు పలికింది. దీంతో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక గత 2019 ఎన్నికల్లోనూ ఆయన సునాయాసంగానే గెలుపుగుర్రం ఎక్కారు. దీనికి ఆర్ ఎస్ ఎస్ కూడా అప్పట్లో వెనుకాడలేదు. అయితే.. రానురాను .. మోడీపై దేశంలో వ్యతిరేకత పెరుగుతున్న విషయాన్ని ఆర్ ఎస్ ఎస్ బాగానే గుర్తించింది. ఇటీవల దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం బీజేపీని ఘోరంగా దెబ్బతీసింది. అధికారంలోకి వచ్చేస్తామని మోడీ సవాల్ చేసిన బెంగాల్‌లో కనీసీం మూడంకెల స్థాయికి కూడా చేరలేదు. ఈ పరిణామం తర్వాత.. బీజేపీ ఆర్ ఎస్ ఎస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది.

నిజానికి ఇప్పటి వరకు గడిచిన కాలాన్ని పరిశీలిస్తే.. బీజేపీ అంటే.. మోడీ అని మోడీ అంటే.. బీజేపీ అనే విధంగా బీజేపీ ఆర్ ఎస్ ఎస్‌లో మోడీ అమిత్ షాలను తయారుచేశారని అంటున్నారు. మరీ ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల్లో కనుక బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇక మోడీని ఈ దేశంలో ఢీ కొట్టే మొనగాడు ఎవరూ లేరనే విధంగా కొందరు ప్రచారం చేశారు. ఆఖరుకు కొన్ని ఛానెళ్లను కూడా మేనేజ్ చేసి.. ప్రీ పోల్ ఎక్జిట్ పోల్ సర్వేలను మేనేజ్ చేసి.. 160 నుంచి 200 వరకు సీట్లు వస్తాయని.. బీజేపీకి బెంగాల్‌లో విజయం తథ్యమని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.

అయితే.. ఈ ప్రచారం ప్రబావమో.. లేక ప్రజా తీర్పో తెలియదు కానీ.. బీజేపీకి కొంత మేలు జరిగినా.. లక్ష్యం మాత్రం సాధించలేదు. మూడుసీట్ల నుంచి 74 స్థానాలకు ఎదిగారు. ఇది ఒకరకంగా బీజేపీకి చెప్పుకొనేందు కు ఒక అంశం అయితే.. లభించిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఇది సరైన నిర్ణయం కాదని మోడీ అమి త్ షా చేతిలో బీజేపీ బందీ అయిపోయిందని.. వాళ్లు చేసే ప్రతి పనికి.. మనం చప్పట్లు కొట్టలేము.. అనే విధంగా ఈ మధ్య ధిక్కార స్వరం వినిపిస్తోందని అంటున్నారు.

కరోనా తర్వాత.. మోడీ వేవ్ దేశవ్యాప్తంగా బాగా తగ్గిపోయిందని.. బీజేపీ ఆల్టర్నేటివ్ చూడాలని అంటున్నా రు. అందులో ముందు వరుసలో ప్రస్తుత కేంద్ర మంత్రి మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ ఉన్నారని  కొందరు టీవీ చర్చల్లో మాట్లాడుతున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల సమయానికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉంటారా?  లేక .. వేరే పీఎం అభ్యర్థి ఉంటారా?  అనే విషయంలో బీజేపీ పెద్ద గందరగోళంలో ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.