Begin typing your search above and press return to search.

సీమను రెచ్చగొడితే... అసలు తట్టుకోలేరు... ?

By:  Tupaki Desk   |   7 Dec 2021 11:41 AM GMT
సీమను రెచ్చగొడితే... అసలు తట్టుకోలేరు... ?
X
రాయలసీమ గురించి ఎన్నో ఫ్రాక్షన్ సినిమాలు వచ్చిన అక్కడి ప్రజలు నిజంగా శాంత స్వభావులు. వారి పలకరింపులో ప్రేమ ఉంటుంది. వారి మమకారం తేనే కన్నా తీయగా ఉంటుంది.

అందరికీ ఆదరించి అక్కున చేర్చుకునే గుణం వారి సొంతం. సీమలో తిరిగిన వారు, పెరిగిన వారు అక్కడ వారి గురించి చెప్పే మంచి మాట ఇది. అలాంటి రాయలసీమ వాసులను రెచ్చగొడితే ఏమవుతుంది అంటే తీవ్ర పరిణామాలే అంటున్నారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి.

రాయలసీమకు ఏమీ వద్దు అంటూ అమరావతి రైతులు తిరుపతిలో వేలాది మందితో మీటింగ్ పెడితే తాము మౌనంగా చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.

రాయలసీమకు హై కోర్టు కూడా వద్దు అంటూ పాదయాత్ర చేస్తూ ఎస్వీ యూనివర్శిటీలో సభ ద్వారా అదే చెప్పదలచుకుంటే తాము తప్పకుండా ప్రతిఘటిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమవాసులకు హైకోర్టు మాత్రమే కాదు, రాజధాని కూడా కావాలని ఆయన డిమాండ్ చేశారు.

కోస్తా కంటే కూడా అన్ని రకాలుగా వెనకబడిన రాయలసీమకు కొత్త నగరం కావాలని ఆయన కోరారు. కడితే సీమలోనే రాజధాని నగరం కట్టాలని కూడా ఆయన పేర్కొన్నారు. సీమలో ఉన్న అన్ని నగరాలు చాలా చిన్నవని, అభివృద్ధి చెందలేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా సీమకు న్యాయం జరగాలని, హై కోర్టు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పిన వామపక్షాలు, బీజేపీ ఇపుడు అమరావతి రైతుల సభలో పాల్గొని సీమ ప్రజలకు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి సీమకు న్యాయం చేయలని ఆయన కోరుతున్నారు. తాము ఇంతకాలం మౌనంగా ఉన్నమంటే అమరావతి రైతులు వారి ఆవేదనను ప్రజాస్వామిక పద్ధతిలో వారు తెలియచేసుకుంటారనే అని ఆయన అన్నారు.

అలా కాకుండా సీమకు ఏమీ అవసరం లేదని సీమ నడిబొడ్డున నిలబడి నినదీస్తే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు రాజధాని కావాలంటూ తాము కూడా విద్యార్ధుల వద్దకు వెళ్ళి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి చూస్తూంటే సీమ మళ్ళీ రగుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.