Begin typing your search above and press return to search.

బాల‌య్యా.. వైస్రాయ్ ఎపిసోడ్ మ‌ర్చిపోవుగా?

By:  Tupaki Desk   |   10 April 2017 3:06 PM IST
బాల‌య్యా.. వైస్రాయ్ ఎపిసోడ్ మ‌ర్చిపోవుగా?
X
క‌దిలించి మ‌రీ కంప నెత్తి మీద వేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. ఆ మ‌ధ్య‌న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌ట‌న ఒక‌టి విన్న వెంట‌నే చాలామందికి క‌లిగిన ఫీలింగ్ ఇదే. బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తున్న వేళ‌.. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్ లో ఎన్టీవోడి బ‌యోపిక్‌ను అనౌన్స్ చేసేశారు బాల‌య్య‌. చెప్పినంత ఈజీ కాదు.. ఆ సినిమాను తెర‌కెక్కించ‌టం. అందులోకి తెలుగునాట ఎన్టీవోడి గురించి.. ఆయ‌న రాజ‌కీయాల గురించి.. ఆయ‌న‌కు ఎదురైన ఘోర అవ‌మానాల గురించి అంద‌రికి తెలిసినవే.

మ‌రి.. అంద‌రికి తెలిసిన విష‌యాల్ని ఆయ‌న ఎలా తీస్తార‌న్న‌ది కొంద‌రి సందేహ‌మైతే.. బాల‌కృష్ణ సోద‌రి.. మాజీ కేంద్ర‌మంత్రి పురంధేశ్వ‌రి లాంటి వారికైతే మ‌రికొన్ని డౌట్లు ఉన్నాయి. అస‌లు వైస్రాయ్ ఎపిసోడ్ ఎన్టీవోడి సినిమాలో ఉంటుందా? లేదా? అన్న‌ది కూడా ఉంది. అదే విష‌యాన్ని తాజాగా ఆమె ఒక ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టంగా ప్ర‌స్తావించారు కూడా. ఎన్టీవోడి బ‌యోపిక్ లో వైస్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ (ఎన్టీఆర్ ను సీఎం ప‌ద‌వి నుంచి కూల‌దోసి.. చంద్ర‌బాబు సీఎం కావ‌టానికి వైస్రాయ్‌ ను వేదిక‌గా చేసుకొని న‌డిపిన త‌తంగ‌మంతా) ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ర్చిపోవ‌టానికి వీల్లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న పురందేశ్వ‌రికి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అస్స‌లు ప‌డ‌ద‌న్న విష‌యం తెలిసిందే. బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. పురంధేశ్వ‌రి అక్కాచెల్లెళ్లు అయిన‌ప్ప‌టికీ.. ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయంగా ఎంత దూరం ఉంద‌న్న విష‌యం తెలిసిందే.

తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ద‌గ్గుబాటి ఫ్యామిలీని దారుణంగా అవ‌మానించిన చంద్ర‌బాబును అంత‌కంతా దెబ్బ తీయ‌టానికి పురందేశ్వ‌రి త‌హ‌త‌హ‌లాడ‌తార‌ని చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే.. తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఆమె నీడ ప‌డ‌టానికి కూడా చంద్ర‌బాబుకు ఇష్టం ఉండ‌ద‌న్న మాట వినిపిస్తుంది. కుటుంబప‌రంగా చూసిన‌ప్పుడు పురందేశ్వ‌రికి నంద‌మూరి కుటుంబంలో మంచి ప‌ట్టు ఉండ‌టంతో పాటు.. ఆమె స‌ల‌హాకుఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అయితే.. రాజ‌కీయాంశాలు దీనికి మిన‌హాయింపుగా చెబుతుంటారు.

ఎన్టీవోడు బ‌యోపిక్ అంశంపై స్పందించిన పురంధేశ్వ‌రి మాట్లాడుతూ.. "బాల‌కృష్ణ‌కు అన్ని తెలుసు. ఎన్టీఆర్‌ కు వ్య‌తిరేకంగా జ‌రిగిన‌వ‌న్నీ తెలుసు. తాను తీసే సినిమా ప‌ట్ల బాల‌కృష్ణ సిన్సియ‌ర్ అయితే.. త‌ప్ప‌కుండా వైస్రాయ్ ఎపిసోడ్ ఉండాల్సిందే. అది లేకుండా ఆ సినిమా అసంపూర్ణం" అని వ్యాఖ్యానించారు. ఇక‌.. ల‌క్ష్మిపార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌టంపై స్పందించిన పురంధేశ్వ‌రి.. అప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుతో త‌న‌కెలాంటి శ‌త్రుత్వం లేద‌న్న పురంధేవ్వ‌రి రాజ‌కీయాలు వేరు.. వ్య‌క్తిగ‌త విష‌యాలు వేర‌ని చెప్పారు.

ఫిరాయింపుదారుల‌ను మంత్రివ‌ర్గంలో చేర్చుకున్న అంశంపై పార్టీ చీఫ్ అమిత్ షాకు ఫిర్యాదు చేయ‌టం గురించి ప్ర‌స్తావించ‌గా స్పందించిన పురంధేశ్వ‌రి.. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ ప‌రిణామాలు బాధ‌ను క‌లిగిస్తున్నాయ‌న్నారు. వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌న్నారు. లోకేశ్ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన సంద‌ర్బంగా త‌మ‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌న్న విష‌యాన్ని చెప్పిన పురంధేశ్వ‌రి.. అలా ఎందుక‌న్న‌ది చంద్ర‌బాబునే అడిగితే బాగుంటుంద‌న్నారు. లోకేశ్‌ కు త‌న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయ‌న్న పురంధేశ్వ‌రి.. మంత్రిగా లోకేశ్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి త‌మ‌కుఆహ్వానం అంద‌లేద‌ని.. ఒక‌వేళ వ‌చ్చి ఉంటే.. త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌య్యే వాళ్ల‌మ‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/