Begin typing your search above and press return to search.

బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై పురందేశ్వ‌రి కౌంట‌ర్ ఇదే

By:  Tupaki Desk   |   25 April 2018 1:27 PM GMT
బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై పురందేశ్వ‌రి కౌంట‌ర్ ఇదే
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేటాయింపు, ఇత‌ర హామీల ప‌రిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షను చేసిన సంద‌ర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నరేంద్ర మోడీ శిఖండీలా, అన్యాయమైన రాజకీయాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించడం..దీనిపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌లు తీవ్రస్థాయిలో మండిపడ‌టం తెలిసిన సంగ‌తే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా బాల‌య్య సోద‌రి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక భాజపా శ్రేణులకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశనం చేశారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున పక్కా ప్రణాళికతో నడుచుకోవాలని శ్రేణులకు ఆమె సూచించారు. ప్రచార కార్యక్రమం ద్వారా ఓటర్లకు ఎలా చేరువ కావాలో సూచనలు చేశారు. ప‌క్క రాష్ర్టాల నేత‌లు స‌మ‌స్య‌లు తీర్చ‌లేర‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించేలా తెలియ‌జేయాల‌ని ఆమె కోరారు. రాష్ట్రంలో ఓటర్లు మార్పును కోరుకుంటున్నట్లు తమ పార్టీ పరిశీలనలో వెల్లడైందని పురందేశ్వరి చెప్పారు. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు వారు విజ్ఞత గలవారని, వారు స‌రైన నాయ‌కుడికే ఓటు వేస్తార‌ని పేర్కొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ త‌న సోద‌రుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీపై అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని సభ్య సమాజం ఆమోదించదని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన ఉన్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తిపై ప్ర‌జాప్ర‌తినిధి హోదాలో ఉన్న‌వారు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని పురందేశ్వ‌రి స్ప‌ష్టం చేశారు.

కాగా, కర్నాటకలోని బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే సందర్భంగా సినీ నటుడు సాయికుమార్ సైతం బాల‌య్య‌పై స్పందించిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోడీపై బాలకృష్ణ చేసినవి అనుచిత వ్యాఖ్యలని ఆయన స్ప‌ష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పై బాలయ్య బాబు వ్యాఖ్యలకు సాటి నటుడిగా నేను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. బాలయ్య ఆవేశపరుడని, మోడీ గారిని అలా మాట్లాడకూడదని… అతని తరపున తాను క్షమాపణ కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించారు.