Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఆర్‌.కృష్ణ‌య్య‌??

By:  Tupaki Desk   |   22 May 2017 9:58 AM GMT
బీజేపీలోకి ఆర్‌.కృష్ణ‌య్య‌??
X
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా మ‌రో షాక్ త‌గిలేందుకు సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, పెద్ద ఎత్తున త‌న క్యాడ‌ర్‌ను చేజార్చుకున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఎమ్మెల్యే సైకిల్ దిగేందుకు సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే అత్యంత ఆస‌క్తిక‌రంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు కాకుండా మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీలో స‌ద‌రు ఎమ్మెల్యే చేర‌నున్న‌ట్లు స‌మాచారం. పైగా అందుకోసం బీజేపీకి చెందిన ఏపీ నాయ‌కురాలు లాబీయింగ్ న‌డ‌ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రంటే...ఎల్‌బీ న‌గ‌ర్ టీడీపీ శాస‌న‌స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య‌. చ‌ర్చ‌లు నిర్వ‌హించింది బీజేపీ అగ్ర‌నేత పురంధేశ్వ‌రీ!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి బీజేపీ నేతలు వీలైనన్న ఎక్కువ మంది నేతల్ని పార్టీలోకి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల్లో అసంతృప్తులు, త‌ట‌స్తుల‌కు కాషాయ కండువా క‌ప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించ‌డాన్ని ఈ జాయినింగ్‌ల‌కు వేదిక‌గా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యతో పురంధేశ్వరి భేటీ అయ్యారని స‌మాచారం. సుమారు గంటపాటు వీరి మధ్య జ‌రిగిన చర్చల్లో ఆర్‌.కృష్ణ‌య్య‌ను పార్టీలోకి రావాలని పురందీశ్వ‌రీ ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీలోకి రావాలన్న ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని కృష్ణయ్య సమాధానం చెప్పినట్టు సమాచారం. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అంట‌నే విమ‌ర్శ‌లు గుప్పించే పురంధేశ్వరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో భేటీ కావడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

ఇదిలాఉండ‌గా... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పట్టు పెంచుకోవటమే లక్ష్యంగా పల్లె పల్లెకు బీజేపీ- ఇంటింటికీ మోడీ నినాదంతో ప్ర‌ణాళిక సిద్ధం చేసిన అమిత్ షా 3 రోజుల తెలంగాణ టూర్‌కు నేడు విచ్చేశారు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా.. తొలుత నల్గొండ జిల్లా చండూరు మండలం తెరటుపల్లి గ్రామానికి బ‌య‌ల్దేరి వెళ్లారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు బూత్‌స్థాయి కార్యకర్తలతో అమిత్ షా మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరు తెలుసుకుని, ప్రజలతో మమేకం కానున్నారు. గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించడంతో పాటు.. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన మైసయ్యగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల దాష్టికాలకు బలైన వీరుల కుటుంబ సభ్యులనూ కలుసుకోనున్నారు. ఆయన సందర్శించిన ఇళ్లపై పార్టీ కార్యకర్తలు ప్రత్యేక గుర్తులు వేయనున్నట్లు తెలుస్తోంది.