Begin typing your search above and press return to search.

పురందీశ్వ‌రీ ఏ పార్టీలో ఉన్నారు?

By:  Tupaki Desk   |   7 Sept 2016 12:06 PM IST
పురందీశ్వ‌రీ ఏ పార్టీలో ఉన్నారు?
X
కేంద్ర మాజీమంత్రి - బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై స్పందించారు. స్పెష‌ల్ స్టేట‌స్ అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదని అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దు అని 14వ ఆర్థిక సంఘంతో ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. వారి చర్యలు మాత్రం అలాగే ఉన్నాయని పురందీశ్వ‌రి అన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేకహోదా అడుగుతున్నాయని తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వడం కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కు కూడా స్థానం ఉంటుందన్నారు.

విభ‌జ‌న వ‌ల్ల న‌ష్ట‌పోయిన‌ ఆంద్రప్రదేశ్‌ ను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురందీశ్వ‌రీ పున‌రుద్ఘాటించారు. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం ఇప్పటికే రూ.4వేల కోట్లు ఇచ్చిందని.. 2019 నాటికి లోటు మొత్తాన్ని భర్తీ చేస్తుందని తెలిపారు. అయితే ఈ విష‌యంలో ఏపీ స‌ర్కారు త‌గు లెక్క‌లు వివ‌రాలు చూపించాల్సిందేన‌ని పురందీశ్వ‌రీ పున‌రుద్ఘాటించారు. పురందీశ్వ‌రీ ప్ర‌స్తుతం చెప్తున్న విష‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ ఆమె కామెంట్లపై కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయ‌కురాలిగా ఉన్న‌పుడు కేంద్ర మంత్రి హోదాలో తాము ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేశామ‌ని చెప్పుకొచ్చిన చిన్న‌మ్మ ఇప్పుడు మాట మార్చ‌డం ఏంట‌ని ప్రశ్నిస్తున్నారు. ఇపుడు బీజేపీ నాయ‌కురాలిగా ఉన్నంత మాత్రానా అప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు - అందులో త‌ను పోషించిన పాత్ర‌ను సైతం ఆమె ప‌క్క‌న పెట్టేయ‌డం ఎలాంటి అభిప్రాయాన్ని తెలియ‌జేస్తుందో చిన్న‌మ్మే ఆలోచించుకోవాల‌ని అంటున్నారు.