Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ ఫైర్ః ఆనాడు ర‌క్తం మ‌ర‌గ‌లేదా బాబు?

By:  Tupaki Desk   |   7 Sept 2016 3:00 PM IST
చిన్న‌మ్మ ఫైర్ః ఆనాడు ర‌క్తం మ‌ర‌గ‌లేదా బాబు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ జాతీయ నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక ప్యాకేజీపై ఆమె ఓ టీవీ చాన‌ల్‌ తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. టీడీపీ మిత్ర‌ప‌క్షమైన బీజేపీ నాయ‌కురాలిగా ఆమె మాట్లాడుతున్న‌ప్ప‌టి త‌మ పార్టీని స‌మ‌ర్థించుకొస్తూనే చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌న‌నే విధంగా కేంద్రంగా వ్య‌వ‌హరిస్తుండ‌టంతో త‌న ర‌క్తం మ‌రిగిపోయింద‌న్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ....2017 మార్చి తర్వాత ఏ రాష్ట్రానికి ఆ హోదా ఉండదని స్వయంగా చెప్పిన విష‌యాన్ని మ‌రిచారా అంటూ పురందీశ్వ‌రి సూటిగా ప్ర‌శ్నించారు. చంద్రబాబే స్వ‌యంగా చెప్పిన‌పుడు ర‌క్తం మ‌ర‌గ‌లేదా అంటూ ఆమె పురందీశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఏపీకి స‌హాయం కోసం కేంద్రం సంసిద్ధంగా ఉంద‌ని, అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌ను పాటించాల‌ని ఆమె తెలిపారు.

కేంద్రం స‌హాయం చేయ‌డం లేద‌నే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌డం స‌రికాద‌ని పురందీశ్వ‌రి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అడిగే స‌మాచారాన్ని ఇవ్వ‌డం లేద‌ని ఆమె తప్పుప‌ట్టారు. రాజ‌ధాని నిర్మాణం డీపీఆర్ ఇవ్వ‌లేద‌ని, పోల‌వరం ప్రాజెక్టు విష‌యంలోనూ ఇదే చేశార‌ని తెలిపారు. ప‌ట్టిసీమ విష‌యంలో అయితే రూ. 955 కోట్లు పట్టి సీమకు పెట్టాము. రూ. 184 కోట్లు పునరావాసం కోసం పెట్టామని చెప్తున్నారే త‌ప్పించి వివ‌రాలు స్ప‌ష్టంగా తెల‌ప‌డం లేద‌ని అన్నారు. ఇలా అయితే కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ఏ సంస్థ‌లైన నిధుల విష‌యంలో ఎలా భ‌రోసాతో ఉంటాయ‌ని పురందీశ్వ‌రి ప్ర‌శ్నించారు. భూసేక‌ర‌ణ విష‌యంలో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని పురందీశ్వ‌రి తెలిపారు. రైతులకు భూమి ఇవ్వాలని లేన‌ప్ప‌టికీ వారిపై ఒత్తిడి తీసుకువ‌చ్చి మ‌రీ సేక‌రిస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. రాజధాని - మచిలీపట్నం డెవలప్‌ మెంట్ అథారిటీ కోసం తీసుకునే భూములు వంటివి ఏవైనా పారదర్శకంగా ఉండాలని చెబుతున్నప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం సానుకూలంగా ముందుకు సాగ‌డం లేద‌ని అన్నారు. హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ పునరావృతమౌతోందనే అనుమానం పురందీశ్వ‌రి వ్య‌క్తం చేశారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృత‌మై ఉండ‌టం అనేది అంద‌రికీ ఇబ్బందిని తెచ్చిపెట్టే విష‌యమ‌ని తెలిపారు.

2019 ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు గురించి ఆమె స్పందిస్తూ అప్పటి పరిస్థితిని బట్టి మేము అంచనా వేసుకుంటామ‌ని తెలిపారు. అయితే రైతు - డ్వాక్రా రుణమాఫీలు సరిగా జరగలేదనే బాధ చాలామందిలో ఉందని ఆమె చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కచ్చితంగా ఉంటుందని అయితే ఎన్నికలు-పొత్తులు ఆనాటి పరిణామాలపైనే ఆధారపడి ఉంటాయని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యేల‌కు ఉన్న ఇబ్బందులు, వారికున్న వ్యాపారాలు కాపాడుకోవడానికే ఫిరాయింపులు జరుగుతున్నాయేమోన‌ని పురందీశ్వ‌రి అభిప్రాయ‌ప‌డ్డారు.