Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గూటి వైపు దృష్టి పెట్టిన చిన్న‌మ్మ‌?

By:  Tupaki Desk   |   12 May 2018 1:18 PM IST
జ‌గ‌న్ గూటి వైపు దృష్టి పెట్టిన చిన్న‌మ్మ‌?
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయా? రానున్న రోజుల్లో ఆస‌క్తిక‌ర మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున చేసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పూర్తిగా విఫ‌లం కావ‌టం.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో బాబు దారుణంగా ఫెయిల్ కావ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల్లోనూ బాబు ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి వేళ‌.. బాబును గ‌ద్దె దించేందుకు బ‌ల‌మైన శ‌క్తులు ఏక‌మ‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు బాబు వ్య‌తిరేకుల్ని ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లేలా చేస్తోంది. ఈ మ‌ధ్య‌న టీడీపీకి చెందిన కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

బాబు తీరుతో అసంతృప్తితో ఉన్న టీడీపీ నేత‌లు కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ప‌లువురు నేత‌లు క‌మ‌ల‌నాథుల నుంచి వేరుప‌డి.. జ‌గ‌న్ పార్టీలోకి వ‌చ్చేందుకు రెఢీ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు రెఢీగా ఉన్న‌ట్లుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సాంకేతిక కార‌ణాల‌తో ఆయ‌న చేరిక కాస్త ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీకి చెందిన మ‌రో కీల‌క నేత‌.. ఎన్టీఆర్ కుమార్తె..చిన్న‌మ్మ‌గా సుప‌రిచితురాలైన ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి జ‌గ‌న్ పార్టీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు. బీజేపీలో ప‌రిస్థితులు బాగోలేక‌పోవ‌టం.. ప్ర‌త్యేక హోదా అంశంలో ఆంధ్రా ప్రాంతంలో బీజేపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆ పార్టీలో కొన‌సాగేందుకు ప‌లువురు నేత‌లు సిద్ధంగా లేరు. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌ని చిన్న‌మ్మ డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ తో సంప్ర‌దింపుల కార్య‌క్ర‌మం పూర్తి అయిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీలో చేరేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్న చిన్న‌మ్మ‌ను ఓకే చెప్పాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకున్న ఛ‌రిష్మాతో పాటు.. ఆమె సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు త‌మ పార్టీకి ఆక‌ర్షితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని.. అది పార్టీకి మ‌రింత మేలు చేస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

బాబుకు ద‌గ్గ‌రి బంధువైన పురంధేశ్వ‌రి పార్టీలో ఉంటే.. బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు.. ఆరోప‌ణ‌ల‌కు వ‌చ్చే బ‌లం పార్టీకి మ‌రింత మేలు చేస్తుంద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే అతి త్వ‌ర‌లోనే చిన్న‌మ్మ అలియాస్ పురంధేశ్వ‌రి త‌ప్ప‌నిస‌రిగా జ‌గ‌న్ పార్టీలో చేర‌టం ఖాయ‌మంటున్నారు.