Begin typing your search above and press return to search.

సమాధానం చెప్పలేక పురంధరేశ్వరి ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   7 Sept 2016 4:54 PM IST
సమాధానం చెప్పలేక పురంధరేశ్వరి ఉక్కిరిబిక్కిరి
X
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా.. విశాఖపట్నానికి రైల్వే జోన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చేయబోతున్నట్లుగా ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేత.. కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరిని మీడియా వాళ్లు తెగ ఇబ్బంది పెట్టేశారు. రాష్ట్రాన్ని విభజించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె మంత్రిగా ఉండగా.. విభజనకు సహకరించిన భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు విభజన హామీలపై గట్టిగా నిలదీయడంతో సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు.

హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు మరచిపోతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఆమె సూటిగా సమాధానం చెప్పలేక పోయారు. హోదాపై తిరుపతిలో నాడు ప్రకటన చేయలేదా? ఆర్థిక సంఘం సిఫార్సులతోనే మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇచ్చారా? ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? విశాఖపట్నానికి ఇవ్వాల్సిన రైల్వే జోన్‌ ను విజయవాడకు ఎందుకు తరలిస్తున్నారు? అంటూ విలేకరులు సంధించిన ప్రశ్నలకు జవాబులివ్వలేక పురంధరేశ్వరి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. నవ్వుతూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. తనకూ హోదా విషయంలో సెంటిమెంటు ఉందని.. ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసేలా రాతలు వ్యాఖ్యలు వద్దని.. హోదా అన్న పదం ఉన్నా లేకున్నా అందుకు సమానమైన న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని పురంధరేశ్వరి అన్నారు.

మరోవైపు విశాఖకు రావాల్సిన రైల్వే జోన్ విజయవాడకు మారుతోందన్న ఊహాగానాలపై తెదేపా.. భాజపా ముఖ్య నేతలు రకరకాలుగా స్పందించారు. రైల్వే జోన్ ఎక్కడ వచ్చినా అభ్యంతరం లేదని ఎంపీ హరిబాబు చెప్పగా.. ఎక్కడో ఒక చోట రైల్వే జోన్ తేవాలని ప్రయత్నిస్తున్నామని విష్ణు కుమార్ రాజు అన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా తాను విశాఖకే రైల్వే జోన్ రావాలని కోరుకుంటున్నానని.. ఐతే విజయవాడలో ఏపీలో భాగమే కదా అని తెదేపా మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.